ముస్కాన్‌కు మరణశిక్ష.. పిల్లల భవితవ్యంపై సౌరభ్ కుటుంబం స్పందనిదే.?
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:05 AM
మేరఠ్ బ్లూ డ్రమ్ హత్య కేసులో ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేపత్యంలో సౌరభ్ రాజ్‌పుత్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను హతమార్చిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మేరఠ్ కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో బాధిత కుటుంబం స్పందించింది. ఈ తీర్పుపై సౌరభ్ తల్లి రేణు, సోదరుడు రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి గతేడాదంతా అత్యంత కష్టంగా గడిచిందని వారు పేర్కొన్నారు. ఇక.. సౌరభ్ పిల్లల భవిష్యత్తుపై ఆ కుటుంబ సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు.
సౌరభ్‌కు పుట్టిన పెద్ద కుమార్తెను దత్తత తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మృతుడి తల్లి రేణు తెలిపారు. అయితే చిన్న కుమార్తె సాహిల్‌కు పుట్టిన బిడ్డ కావడంతో ఆమెను నిరాకరించినట్టు తెలుస్తోంది. కాగా.. ముస్కాన్ జైలులో ఉన్న సమయంలో గతేడాది నవంబరు 24న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి తండ్రి ఎవరనే విషయంలో సౌరభ్ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని కోరినట్లు సౌరభ్ సోదరుడు రాహుల్ తెలిపారు. ఆ బిడ్డ సౌరభ్ కుమార్తె అని తేలితే స్వీకరించేందుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం.
కాగా.. సౌరభ్, ముస్కాన్‌లకు 2016లో వివాహమైంది. వీరికి 2019లో ఓ కుమార్తె జన్మించింది. అయితే ముస్కాన్‌కు సాహిల్‌తో సంబంధం ఉందని.. వీరి వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న సౌరభ్‌ను హతమార్చేందుకు ఇద్దరూ కలిసి కుట్రపన్నారని పోలీసుల విచారణలో బహిర్గతమైంది. ఈ క్రమంలోనే 2025 మార్చి 3న సౌరభ్‌ను హతమార్చారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి సిమెంట్, ఇసుక కలపిన ఓ బ్లూ డ్రమ్‌లో దాచినట్టు పోలీసులు తేల్చారు. 14 రోజుల అనంతరం మృతదేహాన్ని గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 126 విచారణలు, 22 మంది సాక్షుల వాంగ్మూలాల అనంతరం.. నిన్న(బుధవారం) కోర్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
బ్లూ డ్రమ్’ హత్య కేసులో దోషులకు మరణశిక్ష
‘సర్’పై సుప్రీంలో ఒవైసీ పిటిషన్