బ్లూ డ్రమ్’ హత్య కేసులో దోషులకు మరణశిక్ష
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:35 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూడ్రమ్ హత్య కేసులో దోషులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.
మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
తప్పు చేసిన వారిని శిక్షించడం కూడా ధర్మంలో భాగమేనన్న న్యాయమూర్తి
భర్తను చంపి, బ్లూ డ్రమ్‌లో కప్పేసిన మహిళ.. సహకరించిన ప్రియుడు
మీరట్, అక్టోబర్ 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూడ్రమ్ హత్య కేసులో దోషులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ముస్కాన్ భర్త సౌరభ్ రాజ్‌పుత్ (మర్చంట్ నేవీ అధికారి) హత్య కేసులో ఈ సంచలన తీర్పు వెలువడింది. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ అరవింద్ కుమార్ మిశ్రా తీర్పు సందర్భంగా మహాభారత శ్లోకాన్ని ఉటంకించారు. తప్పు చేసిన వారిని శిక్షించడం కూడా ధర్మంలో భాగమే (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ)నన్నారు. ఈ తరహా నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తాయని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ముస్కాన్, సాహిల్‌ను దోషులుగా రెండు వారాల క్రితం జడ్జి తేల్చగా, ఇప్పుడు శిక్షను ప్రకటించారు. ముస్కాన్, సాహిల్ ఇద్దరూ జైలు నుంచి వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. సౌరభ్ రాజ్‌పుత్ ఎంతో మంచి వ్యక్తి అని.. నిందితులకు మరణశిక్ష విధిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముస్కాన్ రస్తోగి తల్లిదండ్రులు కోర్టుకు చెప్పారు. అంతేకాదు జైలులో ఉన్న రస్తోగిని వారు కలుసుకోలేదు. ఈ కేసుకు సంబంధించి 122 విచారణలు జరగ్గా, 22 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, పథకం ప్రకారం సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్యచేసినట్లు జడ్జి తేల్చారు.
2025 మార్చి 3న ముస్కాన్ రస్తోగి ఇంద్రానగర్‌లోని తమ నివాసంలో భర్త సౌరభ్ రాజ్‌పుత్‌కు ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించగా, కొంతసేపటికి సాహిల్ శుక్లా రంగప్రవేశం చేశాడు. ఇద్దరూ కలసి కత్తులతో పొడిచి సౌరభ్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. దుర్వాసన రాకుండా మృతుడి శరీర భాగాలను బ్లూడ్రమ్‌లో వేసి, సిమెంట్, ఇసుక, నీరు కలిపిన మిశ్రమం వేసి సీల్ చేసినట్లు వివరించింది. ఆ తర్వాతి రోజు నిందితులు ఇద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌కు పారిపోయారు. సౌరభ్ ఫోన్ నుంచే అతడి కుటుంబ సభ్యులతో ముస్కాన్ చాట్ చేస్తూ, అతడు జీవించి ఉన్నట్లు నమ్మించింది. మార్చి 17న బంధువులు, స్థానికులు అనుమానంతో సౌరభ్ ఇంటికి వెళ్లి చూడడంతో విషయం బయటకు వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ
తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా, సీజేపీ నేతలపై ఏసీపీ ఫిర్యాదు!