విదేశాల్లో భారతీయుల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. కేంద్రం స్పష్టీకరణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:25 PM
సౌదీ అరేబియాలో పౌరుల మౌలిక సౌకర్యాలపై వరుస దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దాడులు పూర్తిగా అవాంఛనీయం, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దాడులను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలో పౌరుల మౌలిక సౌకర్యాలపై వరుస దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దాడులు పూర్తిగా అవాంఛనీయం, ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దాడులను వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని కోరింది. విదేశాల్లో భారతీయుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల 11న రియాద్ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన భారతీయుడి అంత్యక్రియలు సౌదీ రాజధానిలో ముగిశాయని ఆయన తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల కోరిక ప్రకారం అంత్యక్రియలు జరిగాయని చెప్పారు. రియాద్‌లో భారతీయ ఎంబసీ ఇందుకు సాయం చేసిందన్నారు.
ఐసీయూలోనే నలుగురు భారతీయులు
రియాద్ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడిన 11 మంది ఇండియన్లలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతా 8 మంది ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ 8 మందిలో నలుగురు ఐసీయూలో ఉన్నారని వెల్లడించారు. ‘సౌదీలో భారత ఎంబసీ అధికారులు ఎప్పటికపుడు బాధితుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారి కుటుంబాలతోనూ టచ్‌లో ఉన్నారు. దాడులు కరెక్టు కాదు. దాడులను వెంటనే ఆపాలి. సౌదీ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వానికి అండగా ఉంటాం. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొంటుందని ఆశిస్తున్నా’ అని జైస్వాల్ పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో దాడుల నేపథ్యంలో అక్కడే ఇరుక్కుపోయిన భారతీయులకు ఎప్పటికపుడు సమాచారం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా.. రియాద్‌లో కింగ్ ఖాలిద్ విమానాశ్రయంతో పాటు అభా విమానాశ్రయంపై హూతీలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు విమానాల రాకపోకలపై ప్రభావం పడి ప్రయాణికులు ఇరుక్కుపోయారు.
ఈ వార్తలూ చదవండి
రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో