రేపటి నుంచే విజయవాడ ‘సరస్ మేళా’.. పనులను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:01 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రేపు విజయవాడలో ప్రారంభం కానున్న ‘సరస్ మేళా’ పనులను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
అమరావతి, అక్టోబర్ 14: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సరస్ మేళా’ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (గురువారం)
ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాటు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా సహాయమంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎంపీ కేశినేని మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్రప్రభుత్వం సంయుక్తంగా ‘సరస్ మేళా’ను నిర్వహించనున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశం. ఉత్పత్తి, విక్రయాల్లోనూ మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దేశవ్యాప్తంగా 480 స్వయం సహాయక సంఘాలకు చెందిన ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శిస్తారు. దీంతో పాటు మహిళలకు అవసరమైన శిక్షణ అందించేందుకు.. ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు, వారి ఆర్థిక అభివృద్ధికి సరస్ మేళా దోహదపడుతుంది. ప్రజలందరూ ఈ మేళాలో పాల్గొని విజయవంతం చేయాలి’ అని ఎంపీ విన్నవించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్లో కలకలం
Read Latest AP News And Telugu News