Share News

మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్‌లో కలకలం

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:37 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌లో ఆహార నాణ్యతపై వివాదం నెలకొంది. మటన్ మండి తింటుండగా పంటి అవశేషం కనిపించిందని ఓ కస్టమర్ ఆరోపించారు.

మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్‌లో కలకలం
Hyderabad Restaurant Controversy

హైదరాబాద్‌, అక్టోబర్ 14: నగరంలోని మాదాపూర్‌లో ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్‌లో ఆహార నాణ్యతపై వివాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లో మటన్ మండి తింటుండగా ఆహారంలో పంటి అవశేషం కనిపించిందని ఓ కస్టమర్ ఆరోపించారు. దీంతో ఆయన వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే.. తన ఫిర్యాదుపై స్పందించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా బెదిరింపులకు దిగిందని బాధితుడు ఆరోపించారు. ఏం చేసుకుంటావో చేసుకో.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో అంటూ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ఆహారంలో పంటి అవశేషం కనిపించడంపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తి.. వినియోగదారులకు అందించే ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించినట్లు తెలిపారు.


ఈ ఘటనపై బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదుపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నిహారిక స్పందించినట్లు తెలిపారు. అయితే.. సమస్యను పరిష్కరించేందుకు సెటిల్‌మెంట్ చేసుకోవాలని సూచించినట్లు బాధితుడు ఆరోపించారు. ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా అధికారులు ఘటనాస్థలికి చేరుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. అధికారుల అండదండలు ఉన్నాయంటూ కొందరు ఫోన్ కాల్స్ చేసి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఆహార భద్రతపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటూ.. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆహార నాణ్యతలో నిర్లక్ష్యం జరిగిందా? ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు ఎలా స్పందించారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, ఈ ఆరోపణలపై రెస్టారెంట్ యాజమాన్యం, సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.


ఈ వార్తలూ చదవండి

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 14 , 2026 | 05:20 PM