పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:36 PM
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతోపాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.
అమరావతి, అక్టోబర్14: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతోపాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ, తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ ప్రమోద్ ఉన్నట్లు సమాచారం.
2004లో వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఆ నాటి నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే విజయవాడ నగర మేయర్ పదవి అన్ రిజర్వుడ్ కేటగిరిలోకి వెళ్లింది. కూటమిలోని పార్టీల పొత్తుల్లో భాగంగా మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారనే ఓ చర్చ నడుస్తోంది. దీంతో జనసేన నుంచి మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ బరిలో దిగుతారనే ప్రచారం సాగుతోంది.
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. అలాగే మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్లు జారీ చేసిన విషయం విదితమే.
ఇంకోవైపు స్థానిక సంస్థల్లో కూటమిలో సీట్ల సర్దుబాటుపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేశ్తోపాటు హరిప్రసాద్ చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి
Read Latest AP News And Telugu News