Share News

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:40 AM

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎంపీని ఈడీ అధికారులు విచారించనున్నారు.

వివేకా హత్య కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ అవినాశ్ రెడ్డి
MP Avinash Reddy

అమరావతి/హైదరాబాద్, అక్టోబర్ 14: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కోణంలో ఎంపీని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి బ్యాంకు లావాదేవీలపై స్టేట్‌మెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఎంపీ అందజేశారు. రూ.40 కోట్ల సుపారీతో పాటు సంఘటనా స్థలంలో ఆధారాలు చెరిపి వేయడంపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయవాదితో కలిసి ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.


వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈడీ విచారణకు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి హాజరయ్యారు. ఈ కేసులో వైసీపీ పెద్దల హస్తం ఉందని... రూ.40 కోట్ల డీల్ కుదిరిందని సునీల్ యాదవ్ స్పష్టీకరించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతి, అవినాశ్‌ రెడ్డిలే అంతిమ లబ్ధిదారులంటూ గతంలోనే ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో అవినాశ్ రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన ఈడీ.. రూ.24 లక్షల నగదు, బ్యాంక్ లాకర్ కీని స్వాధీనం చేసుకుంది.


వివేకా హత్య కోసం రూ.40 కోట్లు ఆఫర్ చేశారని గతంలోనే ఎంపీపై సీబీఐ అభియోగం మోపింది. సుపారీ, మనీ ట్రయిల్‌పై సునీల్ యాదవ్, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అవినాశ్‌ రెడ్డిని ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈడీ గుర్తించిన బ్యాంకు లాకర్లు, నగదుపైనా అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే వైఎస్ వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్రను సీబీఐ దాదాపుగా నిర్ధారించింది. వైసీపీ అధికారంలో ఉండగా కర్నూలులోని ఓ ఆస్పత్రి వద్ద కడప ఎంపీ అరెస్ట్ కాకుండా వైసీపీ శ్రేణులు హైడ్రామా సృష్టించారు. నాడు ఎంపీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు.. సీబీఐ అధికారుల వాహనాలను అడ్డుకుని, తీవ్ర ప్రతిఘటనకు దిగిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

రావణ్‌ బెయిల్‌ పిటిషన్‌పై 16న విచారణ

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు, లోకేశ్ సంతాపం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 11:29 AM