Share News

పందిరి సాగుతో లాభాలు.. పండాల్స్‌ ఏర్పాటుకు 50 శాతం రాయితీ

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:22 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్‌ పరిధిలో వందలాది కుటుంబాలు దశాబ్దాలుగా కూరగాయల సాగును నమ్ముకొని ఉపాధి పొందుతున్నాయి.

పందిరి సాగుతో లాభాలు.. పండాల్స్‌ ఏర్పాటుకు 50 శాతం రాయితీ
Vegetable Pandals Farming

  • కాటారం డివిజన్‌లో రైతులకు జీవనోపాధి

  • తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట

  • స్వల్ప పెట్టుబడి.. అధిక దిగుబడి

కాటారం(జయశంకర్ భూపాలపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం డివిజన్‌ పరిధిలో వందలాది కుటుంబాలు దశాబ్దాలుగా కూరగాయల సాగును నమ్ముకొని ఉపాధి పొందుతున్నాయి. ఇది చూసి మరికొందరు ఇదే రంగాన్ని ఎంచుకున్నారు. సంప్రదాయ సాగుకు భిన్నంగా పండాల్స్‌ (పందిళ్లు)తో తక్కువవిస్తీర్ణంలో అధికంగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ప్రయోజనం పొందుతూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.


ప్రభుత్వాల ప్రోత్సాహంతో..

కాటారం డివిజన్‌లోని గంగారం, రేగులగూడెం, కాటారం, దేవరాంపల్లి, కుంభంపల్లి, కొండంపేట, గుమ్మళ్లపల్లి, ఆదివారంపేట, పరికిపల్లి, చింత కాని, జగ్గయ్యపల్లి, సూరారం, బొమ్మాపూర్‌, మద్దులపల్లి తదితర గ్రామాల రైతులు కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. కూరగాయల సాగుదారులకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వా లు శాశ్వత పందిళ్లు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాయి. ఈజీఎస్‌, ఉద్యన శాఖల ద్వారా వందలాది కుటుంబాలకు పండాల్స్‌, కూరగాయలు కోయడానికి క్రేట్లు(పెట్టెలు) ఏర్పాటు చేయించారు. దీంతో బీర, కాకర, సోర, పొట్ల, దొండ వంటి కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతి, చుక్కకూర, గంగవాయిలి, కొత్తిమీర వంటి ఆకుకూరలు పండుతున్నాయి.


hnk1.2.jpgపండాల్స్‌ అంటే..

భూమికి సుమారు 8 ఫీట్ల ఎత్తులో ఉండేలా రాతి స్తంభాలు లేదా సిమెంట్‌ పోల్స్‌ను పాతి పందిరిలా వేస్తారు. ఇనుప తీగలతో పందిరి అల్లుతారు. పందిరి అంతా తీగజాతి కూరగాయలు పారేలా ఏర్పాటు చేస్తారు. అలాగే పందిరి చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుంటారు. ఈ విధానాన్నే పండాల్స్‌ అంటారు. కొందరు వెదురుబొంగులు, కర్రల సాయంతో పందిళ్లు వేసి కూరగాయలు సాగు చేస్తుంటారు.


మహిళలదే ప్రధాన పాత్ర

కూరగాయల సాగులో మహిళలదే ప్రధాన పాత్ర. భూమి దున్నడం, కలుపులేకుండా పురుషులు చేస్తే.. కూరగాయలు కోయడం, కూలీలతో కోయించడం, రవాణా, మార్కెట్లో విక్రయాల వరకు మహిళలే చూసుకుంటారు.

మార్కెటింగ్‌ సౌకర్యాలు లేక ఇబ్బందులు

కూరగాయలు పండిస్తున్న వారికి రవాణా, మార్కెటింగ్‌ ఇబ్బందిగా మారింది. సకాలంలో విక్రయించకుంటే నాణ్యత దెబ్బతిని ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్యాసింజర్‌ ఆటోల్లోనే కూరగాయలను తరలిస్తున్నారు. రైతుబజార్లు లేక సాగుదారులకు కష్టమవుతోంది. దళారులు అడిగిన ధరలకే అమ్ముకునే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి రవాణా, మార్కెటింగ్‌ సౌకర్యాలను కల్పించాలని కూరగాయల సాగుదారులు కోరుతున్నారు.


hnk1.3.jpgపండాల్స్‌ సాగుతో ప్రయోజనాలు

పందిరి సాగు విధానంలో దిగుబడులు పెరుగుతాయి. తెగుళ్లు సోకే అవకాశం తక్కువ. గాలి, వెలుతురు ఎక్కువగా అంది కూరగాయలు ఏపుగా పెరుగుతాయి. బీర, కాకర, సోర, చిక్కుడు, దొండ వంటి పంటలను లాభసాటిగా సాగు చేయొచ్చు. ఒక్కసారి వేస్తే పందిరి 15ఏళ్ల వరకు ఉంటుంది. భూమికి ఎత్తులో ఉండటం వల్ల కీటకాలు, పురుగులు ఆశించవు. కాయలు కుళ్లిపోవడం ఉండదు. పందిరిపై కాయలు వేలాడడంతో సులువుగా కోయొచ్చు, మందులు సైతం సులువుగా స్ప్రే చేయొచ్చు.


పండాల్స్‌ ఏర్పాటుకు 50 శాతం రాయితీ

  • నల్ల తిరుపతి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి (భూపాలపల్లి)

ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. పండాల్స్‌ ఏర్పాటుకు 50శాతం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ఎక రం విస్తీర్ణంలో కూరగాయల సాగుకు రూ. 9,600, కొయ్యలు, కర్రలతో వేసుకునే సపోర్ట్‌ పండాల్స్‌కు రూ.4వేలు చెల్లిస్తున్నాం.


ఈ వార్తలు కూడా చదవండి:

17న అక్కడక్కడ భారీ వర్షాలు

హైదరాబాద్‌లో కొత్తగా 70వేల మంది ఓటర్లు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 10:22 AM