Share News

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు, లోకేశ్ సంతాపం

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:56 AM

నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు ఏవీఎస్ రాజు మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు.

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు మృతి.. చంద్రబాబు, లోకేశ్ సంతాపం
AVS Raju Passes Away

అమరావతి, అక్టోబర్ 14: నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు ఏవీఎస్ రాజు మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నిబద్దత, నిజాయతీ గల దార్శనిక పారిశ్రామికవేత్తగా దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన భాగస్వామ్యం చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో ఎన్‌సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు కృషి ఎనలేనిదని మంత్రి లోకేశ్ తెలిపారు.


చంద్రబాబు పోస్ట్...

నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకులు, చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు మరణం విచారకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించి ఎన్‌సీ‌సీ సంస్థను స్థాపించి విజయవంతంగా నడిపించారని తెలిపారు. నిబద్దత, నిజాయతీ గల దార్శనిక పారిశ్రామికవేత్తగా దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన భాగస్వామ్యం చిరస్మరణీయం, స్ఫూర్తిమంతమని అన్నారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా ఎన్‌సీ‌సీ ఫౌండేషన్‌తో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ది వంటి వాటిల్లో పేదలకు ఆయన అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. పర్యావరణం, గ్రామీణాభివృద్ధి వంటి సమాజ హిత కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఏవీఎస్‌ రాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఎన్‌సీసీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు: మంత్రి లోకేశ్

దాత, రచయిత, ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్ ఏవీఎస్ రాజు మృతి పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో ఎన్‌సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో రాజు కృషి ఎనలేనిదని కొనియాడారు. పద్య రచయితగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఎన్‌సీసీ గ్రూప్ ఛైర్మన్ వివిధ రంగాల ద్వారా అందించిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించిందని తెలిపారు. దశాబ్దాలుగా సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించిన రాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

సౌదీ ఇంధన దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి

రావణ్‌ బెయిల్‌ పిటిషన్‌పై 16న విచారణ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 09:59 AM