Share News

సౌదీ ఇంధన దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:02 AM

సౌదీ అరేబియాపై హూతీ మిలిటెంట్ల దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. సౌదీ చమురు రంగ దిగ్గజం అరాంకో సంస్థ ప్రధాన కార్యాలయంపై హూతీలు మంగళవారం క్షిపణితోో దాడి చేశారు.

సౌదీ ఇంధన దిగ్గజం అరాంకో ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి
Aramco HQ attacked by Houthis

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాపై హూతీ మిలిటెంట్ల దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. సౌదీ చమురు రంగ దిగ్గజ సంస్థ అరాంకో ప్రధాన కార్యాలయాన్ని హూతీలు మంగళవారం టార్గెట్ చేశారు. ధహ్రాన్ నగరంలో అరాంకో కార్యాలయంపై రాత్రి వేళ జరిగిన తాజా దాడిలో భవనంలోని పైమూడు అంతస్తులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగాయని అన్నారు. బాలిస్టిక్ మిసైల్‌తో హూతీలు ఈ దాడి చేశారని చెప్పారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అరాంకో తన ఉద్యోగులను బుధవారం ఇంటి నుంచే తమ విధులు నిర్వహించాలని సూచించింది.

ఇదిలా ఉంటే, రాజధాని రియాద్ వైపుగా వస్తున్న రెండు క్రూయిజ్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో శకలాలు తగిలి స్థానికంగా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు, మరో చిన్నారని గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 15 ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మిసైల్ దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సౌదీ ప్రభుత్వం ప్రజలకు మొబైల్ అలర్టులను పంపించింది.


ఇదిలా ఉంటే, సౌదీ సారథ్యంలోని దళాలు యెమెన్ రాజధాని సనా‌లోని ఇంధన కేంద్రాలపై దాడులు చేశాయి. ధార్మర్, సాదా ప్రావిన్సులపై కూడా దాడులు చేశాయి. ఈ కేంద్రాల నుంచే హూతీలు తమ దేశ భూభాగాలు, జలమార్గాలపై దాడులు చేస్తున్నారని సౌదీ అధికారులు పేర్కొన్నారు.

శనివారం రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హూతీలు జరిపిన దాడిలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిని సౌదీ మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. తమ ప్రజల భద్రతకు, సముద్రమార్గ రవాణా‌కు ముప్పు ఎదురవుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఈ దాడిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తామూ సౌదీలతో కలిసి హూతీలపై దాడులు చేసే అవకాశం ఉందని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రిపబ్లికన్ల గెలుపు కోసం మస్క్‌ భారీగా ఖర్చు

సీజ్ ఫైర్‌ను రష్యా లెక్క చేయట్లేదు: జెలెన్‌స్కీ

Updated Date - Oct 14 , 2026 | 09:38 AM