మున్సిపల్ అభ్యర్థులకు భద్రత కల్పించాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:11 AM
: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ) కి ఆదేశాలివ్వాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.
హైకోర్టులో వైసీపీ పిటిషన్
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ) కి ఆదేశాలివ్వాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ఎస్ఈసీ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత మంగళవారం ఉత్తర్వులిచ్చా రు. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అభ్యర్థులకు రక్షణ కల్పించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్లో కోరారు.
నామినేషన్, స్క్రూటినీ, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి నిరంతరం వెబ్ క్యాస్టింగ్ చేయాలని, అన్ని రికార్డులను ఆరునెలల పాటు భద్రపరచడంతోపాటు కోరిన అభ్యర్థులకు వాటి నకళ్లు అందించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం వ్యాజ్యం విచారణకు రాగా.. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది సంతోష్రెడ్డి కోరారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాకే చర్యలు తీసుకొనేందుకు ఎస్ఈసీకి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత