Share News

మీరట్ బ్లూ డ్రమ్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:19 PM

మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు కోర్టు మరణశిక్ష విధించింది.

మీరట్ బ్లూ డ్రమ్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష
Meerut Blue Drum Case

ఇంటర్నెట్ డెస్క్: మీరట్‌లో జరిగిన బ్లూ డ్రమ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతేడాది మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. 126 విచారణలు, 22 మంది సాక్షుల వాంగ్మూలాల తర్వాత జిల్లా జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా ఈ సంచలన తీర్పు ఇచ్చారు. రస్తోగి, ఆమె ప్రియుడు శుక్లా.. రాజ్‌పుత్‌ను హత్య చేయడానికి కుట్ర పన్ని, అతని శరీర భాగాలను కాంక్రీటు, ఇసుక ఉపయోగించి ఒక నీలిరంగు డ్రమ్‌లో దాచిపెట్టారని విచారణలో రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలాంటి నేరాలు సమాజంలో తీవ్ర భయాన్ని సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు.


సౌరభ్ రాజ్‌పుత్ చాలా మంచి వ్యక్తి అని, దోషులకు మరణశిక్ష విధిస్తే తాము నిరసన తెలపబోమని ముస్కాన్ రస్తోగి తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. రస్తోగిని కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఎప్పుడూ జైలుకు వెళ్లలేదు. పోలీసుల నివేదిక ప్రకారం.. 2025 మార్చి 3న ముస్కాన్ రస్తోగి మందుస్తు ప్లాన్‌ ప్రకారం భర్త సౌరభ్ రాజ్‌‌పుత్‌కు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. దుర్వాసన రాకుండా ఉండటానికి మృతదేహాన్ని బాత్రూమ్‌‌లో ముక్కలుగా నరికి, ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కారు. ఆపై ఇసుక, సిమెంట్ కలిపి డ్రమ్‌లో పోసి సీలు చేశారు.


హత్య తర్వాత వారు హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయారు. సౌరభ్ బతికే ఉన్నట్లు నమ్మించడానికి అతడి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సందేశాలు పంపారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులతో కలిసి మార్చి 17న ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, డ్రమ్‌లో శవం కనిపించింది. రెండు రోజుల తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 13 నెలల తరువాత, 126 విచారణలు, 22 మంది సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 14 , 2026 | 05:33 PM