పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:14 PM
శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా దాడి చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. పోలీసుల దౌర్జన్యంలో కేరళకు చెందిన ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ.. నిన్న( మంగళవారం)శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు క్రూరంగా వ్యవహరించారంటూ.. రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్న కేరళకు చెందిన అథిరా అనే విద్యార్థిని.. పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిందంటూ మండిపడ్డారు. ఈ అమ్మాయికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ నిలదీశారు. గత నిరసనల్లో ఒక అబ్బాయి కళ్లు కోల్పోతే.. ఈ సారి ఓ అమ్మాయి వినికిడి శక్తి కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు నిరసనల్లో దాడికి గురైన విద్యార్థులు.. తమపై జరిగిన అన్యాయాలను మీడియాకు వివరించారు. అథిరా మాట్లాడుతూ.. ‘నిన్న శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నన్ను పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అమ్మాయిలను అరెస్ట్ చేసిన సందర్భంలో ఓ లేడీ కానిస్టేబుల్ వెంట ఉండాలి కదా.. అని ప్రశ్నించాను. దీనిపై కోప్పడ్డ పోలీసులు.. ఆపకుండా చెంపదెబ్బలు కొట్టారు. ఈ దాడిలో నా కంటికి, చెవికి తీవ్రగాయాలయ్యాయి. ఒక చెవి వినికిడి శక్తిని కోల్పోయింది’ అని ఆవేదన చెందారు. మరో నిరసనకారుడు మాట్లాడుతూ.. ‘నన్ను, నా సహోద్యోగిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించి.. 15-20 మంది పోలీసులు అతి దారుణంగా కొట్టారు. పోలీస్‌స్టేషన్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు మమ్మల్ని తరలిస్తున్న సమయంలో.. అంకిత్ కసానా అనే కానిస్టేబుల్ దారిపొడవునా కొడుతూనే ఉన్నాడు’ అని తెలిపారు. వాంతులు వస్తున్నాయని పోలీసులను అభ్యర్థించగా.. ‘బ్యాగ్‌లో వాంతి చేసుకో’ అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారని ఓ విద్యార్థి వాపోయారు. పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తమను అమానుషంగా కొట్టారని, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేశారని ఓ విద్యార్థి తెలిపారు. ఫోన్లు, వాలెట్లను లాక్కొని.. తిరిగి ఇవ్వకుండానే తమను విడుదల చేశారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
దాడులను రికార్డు చేయండి: రాహుల్ గాంధీ
‘పోలీసుల దాడులను ఫోన్లో రికార్డ్ తీయండి. దాడులకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే.. న్యాయపరమైన పోరాటం చేసే అవకాశం ఉంటుంది. మన దగ్గర సాక్ష్యాలు ఉంటే.. కానిస్టేబుల్ నుంచి అమిత్ షా, మోదీ వరకు ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు’అని రాహూల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసుల దాడులపై మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ‘ముందుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆపై.. జంతర్ మంతర్‌పై నిషేధం విధించడం ద్వారా నిరసన చేసే హక్కునే కాలరాశారు. ఇప్పటికైనా జ్ఞానేష్ కుమార్‌ను కాపాడడం మానుకోండి’ అంటూ హితవు పలికారు.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి