రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్.. క్యాబినెట్ కమిటీ ఆమోదం
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:01 PM
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 78 రోజుల బోనస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 78 రోజుల బోనస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశమైంది. రైల్వే శాఖలోని మొత్తం 11,40,770 మంది ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.2009.61 కోట్లను కేంద్రం ఖర్చుపెట్టనుంది. రైల్వే ఉద్యోగులు, సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ సంవత్సరం దసరా పండగకు ముందు ఉద్యోగులకు బోనస్ ఇచ్చినట్లే ఈసారి కూడా పండుగకు ముందే బోనస్ ఇస్తామని వెల్లడించింది. దీంతో ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఈ బోనస్ ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొంది.
కాగా.. క్యాబినెట్ నిర్ణయంతో అర్హులైన ప్రతి రైల్వే ఉద్యోగికి గరిష్టంగా 78 రోజులకు రూ.17,951 బోనస్గా అందనుంది. రైల్వే శాఖలోని ట్రాక్ మెయింటనర్లు, లోకో పైలట్లు, ట్రెయిన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్మన్, మినిస్టీరియల్ స్టాఫ్, గ్రూప్ సీకి చెందిన ఇతర సిబ్బందికి ఈ బోనస్ చెల్లిస్తారు. కాగా.. 2025-26 సంవత్సరంలో రైల్వేల పనితీరు బాగుందని యూనియన్ క్యాబినెట్ తెలిపింది. ఆ సంవత్సరంలో 1670 మిలియన్ టన్నుల కార్గోను రైల్వే రవాణా చేసిందని, అలాగే 7.41 బిలియన్ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారని వివరించింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి