Share News

‘సర్‌’పై సుప్రీంలో ఒవైసీ పిటిషన్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:02 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ నిర్వహణ తీరును సవాలు చేస్తూ మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బుదవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘సర్‌’పై సుప్రీంలో ఒవైసీ పిటిషన్‌
owisi

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ నిర్వహణ తీరును సవాలు చేస్తూ మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బుదవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలను ఎన్నికల సంఘం విస్మరించిందని.. ఫలితంగా అర్హులైన పౌరుల ఓటు హక్కు ప్రమాదంలో పడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒవైసీ తరఫు న్యాయవాది నిజాం పాషా సమర్పించిన ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. సర్‌ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ రాహుల్‌ గాంధీ ఇతర విపక్షనేతలు ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గురువారం విచారణ కోసం ఈ రెండు పిటిషన్లను లిస్ట్‌ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. సర్‌ ప్రక్రియ అంతా కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఓటర్ల నమోదు నిబంధనలు-1960కు లోబడి పూర్తిగా చట్టబద్ధంగా జరిగేలా సుప్రీం జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో ఒవైసీ కోరారు. ఈసీలో ఇతర కమిషనర్లకు తెలియకుండా, వారి అమోదం లేకుండా ఈసీ పేరుతో నిర్ణయాలు వెలువడ్డాయని పిటిషన్‌లో ఒవైసీ ఆరోపించారు. కాగా, అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్షాలతో జట్టు కట్టేందుకు మజ్లిస్‌ సిద్ధంగా ఉందని, తమను కూడా కూటమిలో భాగస్వాములుగా చేసుకోవాలని కోరుతున్నామని పేర్కొన్నారు. యూపీలో యోగి మూడోసారి సీఎం కావడం తమ పార్టీకి కూడా ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించడమే తమ పార్టీ లక్ష్యం అని.. 2029లో ఆ పార్టీ గెలవకుండా ఉండేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 05:03 AM