‘భారతీయులను చంపుతా’.. హిందూ ఆలయమే లక్ష్యంగా రెండేళ్లుగా కుట్ర.!
ABN , Publish Date - Oct 16 , 2026 | 09:41 AM
అమెరికాలోని ఇల్లినోయి రాష్ట్రం అరోరాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు కుట్ర పన్నినట్లు నిందితుడు అలెగ్జాండ్రోస్ పపోరాకిస్పై ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్లుగా దాడికి ప్రణాళిక రచించినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఇల్లినోయి రాష్ట్రంలో హిందూ దేవాలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడి వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అలెగ్జాండ్రోస్ పపోరాకిస్ అనే యువకుడు.. రెండేళ్లుగా దాడికి ప్లాన్ చేసినట్టు కోర్టు పత్రాల ఆధారంగా మీడియా కథనాలు వెల్లడించాయి. చికాగో సమీపంలోని అరోరాలో ఓ ప్రముఖ హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు దర్యాప్తు అధికారులు.
పాలటైన్లోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న నిందితుడు పపోరాకిస్.. భారతీయులను చంపుతానని తోటి ఉద్యోగుల వద్ద చెప్పినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు. హిందూ ఆలయంపై దాడి చేయాలనే ఆలోచననూ వారితో పంచుకున్నట్లు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది. అతడి ప్రవర్తనపై అనుమానంతో ఓ సహోద్యోగి పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
కాగా.. దర్యాప్తు అధికారుల ప్రకారం నిందితుడు దాడికి యత్నించిన సమయంలో అతడి తుపాకీ మొరాయించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడనే ఆరోపణలున్నాయి. అనంతరం ఆయుధాన్ని బాగుచేసి మళ్లీ ప్రయత్నిస్తానని సహోద్యోగికి మెసేజ్ చేసినట్టు కూడా కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో రైఫిల్, తూటాలు, ఇతర ఆయుధ సామగ్రి సహా శ్వేత జాతి ఆధిపత్యవాదానికి సంబంధించిన గుర్తులూ లభించినట్లు అధికారులు తెలిపారు. జాత్యహంకార భావజాలాన్ని వ్యక్తం చేస్తూ, సామూహిక హత్యలకు సంబంధించిన ప్రణాళికను వివరించిన పత్రాన్ని కూడా గుర్తించినట్లు కోర్టు పత్రాల ద్వారా స్పష్టమవుతోంది. అయితే.. ఈ కేసులో ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడటం, అక్రమంగా రైఫిల్ కలిగి ఉండటం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు నిందితుడు పపోరాకిస్. కేసు దర్యాప్తులో ఉండటంతో దాడి లక్ష్యం, కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
గుజరాతీ గర్బాకు స్విస్ అంబాసిడర్ మాయా టిస్సాఫి ఫిదా.!
వర్చువల్ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్