Share News

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:30 AM

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. సీనియర్ ఆఫీసర్.. మహిళా అధికారిపై దురుసు వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ద్వారా తెలుస్తోంది.

వర్చువల్‌ సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం.! వీడియో వైరల్‌
Jammu Kashmir Virtual meeting

ఇంటర్నెట్ డెస్క్: అధికారం అంటే బాధ్యతలతో కూడిన ఓ చక్కటి హోదా. అలాంటి స్థాయిని మరిచి జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు పరస్పరం దూషించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక వర్చువల్ సమావేశానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే...


ప్రతిష్ఠాత్మక జాతీయ గ్రామీణ మిషన్(ఎన్ఆర్ఎల్ఎమ్) పురోగతి సమీక్షలో భాగంగా నిర్వహించిన మిషన్ యువ కార్యక్రమంలో ఉన్నతస్థాయి అధికారుల మధ్య ఇటీవల వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సమీక్షలో కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి కుమార్‌ రాజీవ్‌ రంజన్‌, ఉపాధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బీనిశ్ వాణి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. మహిళా అధికారిపై సీనియర్‌ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అభ్యంతరకర పదజాలం ఉపయోగించినట్లు వైరల్‌ వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా 'నేను నీ పై అధికారి' అని వ్యాఖ్యానించినట్లూ తెలుస్తోంది. అయితే సమీక్ష అనంతరం రాజీవ్ రంజన్ స్పందిస్తూ.. క్షమాపణలు కోరినట్టు సమాచారం. ఈ వాడివేడి వాదనలపై పూర్తి సందర్భాన్ని అర్థం చేసుకోకుండా తుది నిర్ధారణకు రావొద్దని ఆయన అన్నారు.


నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్పులపై జమ్మూకశ్మీర్‌ కార్మిక, ఉపాధి శాఖ స్పందించింది. అధికారిక వ్యవహారాల్లో పరస్పర గౌరవం, క్రమశిక్షణ, వృత్తిపరమైన మర్యాద తప్పనిసరి అని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది వృత్తిపరమైన నిబంధనలను పాటించాలని పేర్కొంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అభ్యంతకర పదజాలానికి అధికారిక సమావేశాల్లో తావుండకూడదని చెప్పుకొచ్చింది. అలాగే సమావేశం సంబంధిత వీడియోలపై మాట్లాడుతూ.. పూర్తి నేపథ్యం లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రచారంలో ఉన్న క్లిప్పులు ధ్రువీకరించినవి కావని, ఎంపిక చేసిన భాగాలను మాత్రమే ప్రసారం చేయడం వల్ల వాస్తవ పరిస్థితులపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశముందని వివరించింది.


ఇవీ చదవండి:

గుజరాతీ గర్బాకు స్విస్‌ అంబాసిడర్‌ మాయా టిస్సాఫి ఫిదా.!

ఆరు భటూరాల్లో.. గ్లాసు నిండా నూనె! వీడియో వైరల్

Updated Date - Oct 16 , 2026 | 08:44 AM