Share News

బాసర క్షేత్రంలో వైభవంగా మూల నక్షత్ర పర్వదిన వేడుకలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 07:27 AM

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా అమ్మవారు కాత్యాయని అలంకరణలో దర్శనమిస్తున్నారు. మహా అక్షరాభ్యాసానికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాసర క్షేత్రంలో వైభవంగా మూల నక్షత్ర పర్వదిన వేడుకలు
Basara Gnana Saraswathi Temple

బాసర, నిర్మల్ జిల్లా (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా.. కాత్యాయనీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఈ సందర్భంగా ఆ జగన్మాతను దర్శించుకునేందుకు పెద్దఎత్తున పోటెత్తుతున్నారు. అమ్మవారి కృపాకటాక్షం తమపై ఉండాలని.. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నారు భక్తులు.


మూల నక్షత్ర పర్వదినానికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉండటంతో బాసర క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అమ్మవారి దర్శనం కోసం ఆసక్తి చూపుతున్నారు. జ్ఞానప్రదాయిని అయిన అమ్మవారి ఆశీస్సులు పొందితే విద్యాభివృద్ధి కలుగుతుందన్న విశ్వాసంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. శరన్నవరాత్రి వేడుకల నేపథ్యంలో బాసర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.


మూల నక్షత్రం సందర్భంగా మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున.. భద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బాసరలోని ఎమ్‌కే కన్వెన్షన్ హాల్‌లో బందోబస్తు విధులకు హాజరైన సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల నిర్వహణపై బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ.. అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు.


ఇవీ చదవండి:

దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత ఇదే!

అందమైన మోముతో భక్తకోటికి కటాక్షం

Updated Date - Oct 16 , 2026 | 07:33 AM