Share News

దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత ఇదే!

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:14 AM

దేవీ శరన్నవరాత్రులంటే ఆధ్యాత్మిక శోభకు ప్రతీక. ఈ తొమ్మిది పర్వదినాల్లో ఆది శక్తిని.. నవదుర్గలుగా కొలుస్తారు భక్తులు ఒక్కో రూపానికి ఓ ప్రత్యేకత ఉండటమే కాకుండా.. భక్తులలో ధైర్యం, జ్ఞానం, శక్తి, ప్రశాంతత వంటి సద్గుణాలను పెంపొందించే ఆధ్యాత్మిక సందేశమూ ఉంది. నవదుర్గలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మరి ఆ తొమ్మిది రూపాల విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం.

దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత ఇదే!
Goddess Durgamatha

భారతీయ సంస్కృతిలో దేవీ శరన్నవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్వయుజ మాసంలో శరదృతువు వేళ తొమ్మిది రాత్రుల పాటు శక్తి ఆరాధనకు ప్రతీకగా నిర్వహించుకునేవే ఈ పర్వదినాలు. అజ్ఞానంపై జ్ఞానం, అధర్మంపై ధర్మం, దుష్టత్వంపై దైవశక్తి సాధించిన విజయానికి సంకేతంగా భావిస్తూ.. ఈ నవరాత్రులను పూజిస్తారు.

పురాణాల ప్రకారం.. మహిషాసురుడనే రాక్షసుడు తన బలంతో దేవతలను, ముళ్లోకాలను హింసించసాగాడని ప్రతీతి. ఆ ఆగడాలను అరికట్టేందుకు దేవతలందరి తేజస్సుల నుంచి ఆదిపరాశక్తి ఆవిర్భవించారు. సింహవాహినిగా అవతరించిన అమ్మవారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో భీకరంగా పోరాడి.. పదో రోజున సంహరించారు. ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని నిర్వహించుకుంటారు. ఈ కథ కేవలం రాక్షస సంహారమే కాదు.. మనలోని అహంకారం, క్రోధం, లోభం వంటి దుర్గుణాలపై విజయం సాధించాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది.


నవ రూపాలు.. ఆధ్యాత్మిక సందేశాలు!

దేవీ ఆరాధనలో భాగంగా అమ్మవారిని నవదుర్గలుగా తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ప్రతి రూపం ఓ ప్రత్యేక గుణానికి, ఆధ్యాత్మిక తత్త్వానికి ప్రతీక అన్నమాట.

శైలపుత్రి.. ధైర్యానికి ప్రతీక

నవదుర్గల్లో మొదటి రూపం శైలపుత్రి. పర్వత రాజైన హిమవంతుని కుమార్తె కావడంతో పార్వతీదేవిని ఈ పేరుతో పిలుస్తారు. గిరిజ, హైమవతి అనే పేర్లతోనూ ప్రసిద్ధి చెందారు. ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో కమలాన్ని ధరించి వృషభంపై దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే ధైర్యం, స్థైర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

బ్రహ్మచారిణి.. జ్ఞాన ప్రదాయిని

ఇక రెండో రూపం బ్రహ్మచారిణి. తపస్సు, నియమ నిష్ఠలకు ప్రతీకగా ఈ అమ్మవారిని కొలుస్తారు. ఓ చేతిలో జపమాల, మరో చేతిలో కమండలాన్ని ధరించి శ్వేత వస్త్రాలతో దర్శనమిస్తారు అమ్మవారు. ఈ తల్లిని పూజిస్తే జ్ఞానం, ఏకాగ్రత, మనోనిగ్రహం పెరుగుతాయని విశ్వసిస్తారు.

చంద్రఘంట.. శక్తి స్వరూపిణి

మూడో రూపమైన చంద్రఘంట అమ్మవారు సింహవాహిని. నుదుటిపై అర్ధచంద్రుడిని ధరించి, పది చేతుల్లో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తారు. దుష్టశక్తులను సంహరించి భక్తులను కాపాడే శక్తిమూర్తిగా ఈమెను ఆరాధిస్తారు. చంద్రఘంటను పూజిస్తే ధైర్యసాహసాలు పెరిగి, మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

కూష్మాండ.. సృష్టికి మూలశక్తి

నవదుర్గల్లో నాలుగో రూపం కూష్మాండ. తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి స్వరూపంగా ఈ అమ్మవారిని పురాణాలు వర్ణిస్తాయి. ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలు, కమండలం, అమృత కలశం, జపమాల, కమలం తదితరాలను ధరించి దర్శనమిస్తారు తల్లి. ఈమెను ఆరాధిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.

స్కందమాత.. సంతాన సౌభాగ్య ప్రదాయిని

ఐదో రూపమైన స్కందమాత కుమారస్వామి తల్లి. సింహవాహినిగా, ఒడిలో కుమారస్వామితో అమ్మవారు దర్శనమిస్తారు. మాతృత్వం, ప్రేమ, కరుణకు ప్రతీకగా ఈమెను కొలుస్తారు. స్కందమాతను పూజిస్తే జ్ఞానం, శాంతి, సౌఖ్యాలు కలుగుతాయని, సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

కాత్యాయనీ.. దుష్ట సంహారిణి

ఆరో రూపం కాత్యాయనీదేవి. కాత్యాయన మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన ఇంట కుమార్తెగా జన్మించడంతో ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. త్రిమూర్తుల శక్తులతో అవతరించి మహిషాసురుడిని సంహరించిన దుర్గారూపంగా ఈమె ప్రసిద్ధి చెందారు. వీరత్వం, ధైర్యానికి ప్రతీకగా నిలిచే కాత్యాయనీదేవిని ఆరాధిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

కాళరాత్రి.. భయాలను తొలగించే తల్లి

ఏడో రూపం కాళరాత్రి. దుష్టశక్తుల సంహారం కోసం ఉగ్రరూపం ధరించిన దుర్గాదేవి స్వరూపమే ఈమె. గాడిద వాహనంగా, విరబోసిన కేశాలతో భయంకర రూపంలో దర్శనమిస్తారు. ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తులకు శుభాలను ప్రసాదించే తల్లిగా ప్రసిద్ధి చెందారు. కాళరాత్రిని పూజిస్తే భయాలు, శత్రు బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.

మహాగౌరి.. మంగళ ప్రదాయిని

ఎనిమిదో రూపమైన మహాగౌరి.. స్వచ్ఛతకు, ప్రశాంతతకు ప్రతీక. శ్వేతవర్ణంతో ప్రకాశించే ఈ అమ్మవారు నాలుగు చేతుల్లో త్రిశూలం, డమరుకం ధరించి.. అభయ, వరద ముద్రలతో భక్తులను అనుగ్రహిస్తారు. మహాగౌరిని ఆరాధిస్తే పాపాలు తొలగి, సుఖ సంతోషాలు, సౌభాగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

సిద్ధిదాత్రి.. సకల సిద్ధుల ప్రదాయిని

నవదుర్గల్లో తొమ్మిదో రూపం సిద్ధిదాత్రి. అణిమ, మహిమ వంటి అష్టమహా సిద్ధులను ప్రసాదించే శక్తిమూర్తిగా ఈమెను పురాణాలు వర్ణిస్తాయి. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాన్ని ధరించి కమలంపై ఆసీనురాలై దర్శనమిస్తారు. సిద్ధిదాత్రిని పూజిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, విజయాలు, మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.


ఇలా నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని పూజించడం ద్వారా శక్తిలోని విభిన్న పార్శ్వాలను స్మరించుకుంటాం. ఈ తొమ్మిది రూపాలు మనిషిలో ధైర్యం, సహనం, కరుణ, పవిత్రత, జ్ఞానం వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలని బోధిస్తాయి. ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి పూజా విధానాలు, అలంకారాలు మారినా అమ్మవారి ఆరాధనలోని మూలభావం ఒక్కటేనని గ్రహించాలి.


ఇవీ చదవండి:

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన బ్రహ్మదేవుడు

గుడికి కాపలా కాచే గుండు

అందమైన మోముతో భక్తకోటికి కటాక్షం

Updated Date - Oct 11 , 2026 | 09:14 AM