ఇంద్రకీలాద్రిపై లడ్డూ ఏటీఎం.. ఇక ప్రసాదం తీసుకోవడం మరింత ఈజీ
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:18 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఈజీ పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు.
విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రికీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఈజీ పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు(బుధవారం) ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు. దసరా నవరాత్రుల నేపథ్యంలో ఈ ఏటీఎంలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఏటీఎం ద్వారా పొందవచ్చు. 100, 200, 300, 400 రూపాయల బాక్సుల రూపంలో ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. బాక్సుకు 6 లడ్డూలను పంపిణీ చేయనుండగా.. ఒక్క బాక్సు ధరను రూ.100గా నిర్ణయించారు. ఏటీఎం మాదిరిగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని లడ్డూలు పొందే సదుపాయాన్ని తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ.. భక్తులందరికీ లడ్డూ ప్రసాదాన్ని అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భక్తులు ఎక్కువ వచ్చే దేవాలయాలలో డిజిటైజేషన్, ఆటోమేషన్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ప్రసాదం వెండింగ్ మెషిన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. యూపీఐ యాప్‌ల ద్వారా నగదు చెల్లించి లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవచ్చని చెప్పారు. దేవస్థానం సిబ్బంది ప్రమేయం లేకుండానే వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా పండుగ రోజుల్లో లిమిట్ ఉంటుందని తెలిపారు. రూ.6 లక్షల ఖర్చుతో మెషిన్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. దేవాలయంలో 70 నుంచి 80 శాతం వరకూ ఆన్‌లైన్ సేవా టికెట్లే ఉంటున్నాయని అన్నారు.
ఆర్జిత సేవా టికెట్ల విషయంలో థర్డ్ పార్టీలను నమ్మొద్దని భక్తులకు కమిషనర్ సూచించారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ విధానమని స్పష్టం చేశారు. భక్తులు ఎవరూ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్ లేదా మనమిత్ర ద్వారా మాత్రమే టికెట్లు ఉంటాయని తెలిపారు. భక్తుల రద్దీ అనుగుణంగా ప్రత్యక్ష పూజలపై నిర్ణయం ఉంటుందని అన్నారు. లక్షన్నరకు పైగా భక్తులు వస్తే వారికి దర్శనం కల్పించాలన్నారు. లక్షలాది భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమని తేల్చిచెప్పారు. తప్పు జరిగితే చట్ట ప్రకారం శిక్షలుంటాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెనాలి రైల్వేస్టేషన్ వద్ద తెగిన విద్యుత్ వైర్లు.. తప్పిన ప్రమాదం
భారీ వర్షాలు.. ఆర్టీసీ అధికారులకు మంత్రి మండిపల్లి ఆదేశాలివే
Read Latest AP News And Telugu News