బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన బ్రహ్మదేవుడు
ABN , Publish Date - Oct 11 , 2026 | 07:41 AM
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న పురాణ గాథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న పురాణ గాథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీనివాసుడికి తొలిసారిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారని వరాహ పురాణం చెబుతోంది. స్వామివారి అనుమతితో ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించినట్లు వివరిస్తోంది. ఈ ఉత్సవాలకు దేవతలు, మహర్షులు, యోగులు, సాధువులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారని, భక్తుల సౌకర్యార్థం విశ్వకర్మ ప్రత్యేక ఏర్పాటు చేశారని పురాణ కథనం తెలియజేస్తోంది.
వరాహ పురాణంలోని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ప్రకారం... సుదర్శన చక్రం తిరిగి వచ్చిన అనంతరం శ్రీమహావిష్ణువు తన నివాసానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో శ్రీహరిని దర్శించిన బ్రహ్మదేవుడు, స్వామివారి సేవలో మరేదైనా చేయాల్సి ఉందా అని అడిగారు. అందుకు విష్ణుమూర్తి తనకు మరే కోరికా లేదని, బ్రహ్మదేవుడు ఏదైనా కోరుకుంటే అనుగ్రహిస్తానని తెలిపారు.
దీంతో బ్రహ్మదేవుడు శ్రీదేవితో కలిసి స్వామివారికి మహోత్సవం నిర్వహించాలని తన కోరికను వ్యక్తం చేశారు. అలాగే ధ్వజారోహణం చేసి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని ప్రార్థించారు. బ్రహ్మదేవుడి కోరికను మన్నించిన శ్రీనివాసుడు ఉత్సవాల నిర్వహణకు అంగీకరించారు. కన్యా మాసంలో, తన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున చక్రస్నానంతో ముగిసేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించినట్లు పురాణం వివరిస్తోంది. ఈ ఉత్సవాలకు దేవతలు, మహర్షులు, యోగులు, సాధువులు, పది దిక్కుల నుంచి వచ్చే భక్తులు హాజర య్యారు. బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
భక్తుల కోసం విశ్వకర్మ ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో వేంకటాచలంపై విస్తృత ఏర్పాట్లు అవసరమయ్యాయి. భక్తుల రాకపోకలు, బస, భోజనం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మదేవుడు దివ్యశిల్పి విశ్వకర్మను పిలిపించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో విశ్వకర్మ కొండపై నీడనిచ్చే పందిళ్లు, విశ్రాంతి గృహాలు, భోజనశాలలు, ఇతర నిర్మాణాలను ఏర్పాటు చేసినట్లు పురాణ గాథ చెబుతోంది.
కొండపై భక్తుల రాకపోకలకు అనుకూలంగా నివాస ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంటోంది. స్వామివారి దివ్యవిమానాన్ని, చుట్టూ ప్రత్యేకంగా ఒక గోపురాన్ని నిర్మించినట్లు కూడా ఈ కథనంలో ఉంది. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశ్వకర్మ ఈ ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేశారని పురాణం వివరిస్తోంది. నేటి బ్రహ్మోత్సవాల్లోనూ లక్షలాది మంది భక్తులకు వసతి, భోజనం, రవాణా వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని ఈ పురాణ గాథ గుర్తు చేస్తోంది.
నవరాత్రుల్లో వాహన సేవలు
బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతీరోజూ శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించడంతోపాటు వివిధ వాహనాలపై ఊరేగింపులు నిర్వహించినట్లు వరాహ పురాణం వివరిస్తోంది. గుర్రం, ఏనుగు, సర్పం, గరుడుడు తదితర వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సంగీతం, వేదపఠనం, నృత్యాలతో ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉత్సవాల సమయంలో స్వామివారికి రకరకాల రుచులతో కూడిన నైవేద్యాలను సమర్పించారు.
వాహనాల ముందు, వెనుక, ఇరువైపులా గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు నడుస్తూ ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయని పురాణ కథనం చెబుతోంది. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు స్వామివారిని విశేషంగా అలంకరించిన రథంపై అధిష్ఠింపజేసి ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి తిరిగి ఆలయానికి చేరుకున్న అనంతరం... రత్నఖచిత స్తంభాలతో అలంకరించిన ఆస్థాన మండపంలో కొలువుదీరినట్లు పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి.
భక్తులకు వరాలు.. సేవకులకు అనుగ్రహం
బ్రహ్మోత్సవాల వైభవానికి సంతోషించిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని అభినందించి, ఉత్సవాలను నిర్వహించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తుల సంక్షేమం కోసం అనేక వరాలు ప్రకటించినట్లు వరాహ పురాణం చెబుతోంది. ప్రతీ ఏడాది కన్యా మాసంలో బ్రహ్మ దేవుడు ప్రారంభించిన విధంగా మహోత్సవాలను నిర్వహించి, తనను భక్తితో సేవించేవారు భౌతిక సుఖాలతోపాటు చివరకు బ్రహ్మ లోకాన్ని పొందుతారని స్వామివారు వరమిచ్చినట్లు పేర్కొంటోంది.
తిరుమలకు దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ప్రకటించినట్లు పురాణం వివరిస్తోంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆహారం, నీరు, విశ్రాంతి వంటి సౌకర్యాలు కల్పించేవారికి స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని తెలిపింది. భక్తులకు అన్నదానం చేయడం, వస్త్రాలు, ధనం దానం చేయడం, నిరుపేదలు, అంధులు, వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవలకు విశేష ఫలితం ఉంటుందని స్వామివారు వరమిచ్చినట్లు కథనం పేర్కొంటోంది.
తిరుమల కొండపై నివాసాలు ఏర్పాటు చేసుకునేవారికి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేవారికి కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందని పురాణం చెబుతోంది. కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకునే భక్తులకు సుఖసంతోషాలు కలుగుతాయని, వారి కోరికలు నెరవేరుతాయని వివరించింది. భక్తుల సేవే దైవసేవ అనే భావనను ఈ గాథ ప్రధానంగా చాటిచెబుతోంది.
కలియుగంలో భక్తులకు అందుబాటులో...
బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలకు వరాలు ప్రసాదించిన అనంతరం శ్రీనివాసుడు తన దివ్యవిమానంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరినట్లు పురాణం వివరిస్తోంది. ఉత్సవాలకు హాజరైన దేవతలంతా జయజయధ్వానాలు చేస్తూ స్వామివారిని స్తుతించారు. అనంతరం తొమ్మిదో రోజు, శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి పవిత్రమైన అవభృథ స్నానం నిర్వహించారు. స్వామి పుష్కరిణిలో జరిగిన ఈ పవిత్ర స్నానంలో బ్రహ్మ దేవుడు, దేవతలు, మహర్షులు, యోగులు, ఇతర భక్తులు పాల్గొన్నట్లు వరాహ పురాణం చెబుతోంది. ఈ స్నానం అనంతరం సనకాది మహర్షుల్లో ఒకరైన సనకుడు అక్కడి వారిని ఉద్దేశించి స్వామి పుష్కరిణి మహిమను వివరించారు.
సమస్త పవిత్ర తీర్థాల స్వరూపుడైన విష్ణుమూర్తికి ఈ పుష్కరిణిలో అవభృథ స్నానం నిర్వహించడం వల్ల ఆ సమయంలో అక్కడ స్నానం చేసినవారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. గత జన్మల పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని వివరించినట్లు పురాణ గాథ చెబుతోంది. అవభృథ స్నానం అనంతరం స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. వివిధ రకాల సువాసనగల పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని పాదాల నుంచి శిరస్సు వరకు పూర్తిగా కప్పివేసి, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగాన్ని సమర్పించినట్టు ఈ గాథ పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు నిర్వహించిన మహోత్సవాలకు ముగింపుగా ఈపుష్పయాగం జరిగింది.
స్వామివారికి భక్తుల సేవే ప్రీతిపాత్రం
బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేసిన శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుడితో సంభాషించినట్లు పురాణం వివరిస్తోంది. తనకు ఈ ఉత్సవాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని, ప్రతిఫలంగా ఏమి కావాలో కోరుకోవాలని స్వామివారు అడిగారు. అందుకు బ్రహ్మదేవుడు తనకు మరే కోరికా లేదని, స్వామివారి కృప మాత్రమే కావాలన్నారట. కలియుగంలో భక్తులకు సులభంగా దర్శనమిచ్చేందుకు వేంకటాచలంపైనే శాశ్వతంగా కొలువుదీరాలని బ్రహ్మదేవుడు కోరారు.
అయితే, సృష్టి నిర్వహణ బాధ్యతలు తనకు ఉన్నందున తిరిగి సత్యలోకానికి వెళ్లాలని బ్రహ్మదేవుడికి స్వామివారు సూచించినట్లు పురాణం చెబుతోంది. అలాగే ఇంద్రుడు అమరావతికి వెళ్లి తన విధులను నిర్వహించాలని, శివుడు కైలాసానికి తిరిగి వెళ్లాలని, అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వెళ్లి శిష్యులతో కలిసి నిత్యకర్మలు కొనసాగించాలని ఆదేశించారట. యోగులు, మహర్షులు కూడా తమ తమ ఆశ్రమాలకు వెళ్లి ప్రపంచ సంక్షేమం కోసం తపస్సు, యోగసాధన కొనసాగించాలని స్వామివారు సూచించారు.
తిరుమలలోనే మహర్షుల ఆశ్రమాలు
శ్రీనివాసుడి మహిమను ప్రత్యక్షంగా అనుభవించిన సనకాది మహర్షులు, ఇతర యోగులు వేంకటాచలంపై నివాసం ఏర్పరుచు కున్నట్టు వరాహ పురాణం ద్వారా తెలుస్తోంది. పాపనాశన తీర్థం పరిసరాల్లో కొందరు మహర్షులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకున్నారు. సప్తర్షులు కూడా వేంకటాచలంపై తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతికి శ్రీమహా లక్ష్మి అనుగ్రహం లభించినట్లు మరో కథనాన్ని ఇందులో వివరించారు. ఫాల్గుణ మాసం లోని పౌర్ణమి రోజున ఫాల్గుణ తీర్థంలో అరుంధతికి దర్శనమిచ్చిన మహాలక్ష్మి, ఆమెకు వరాలు ప్రసాదించారు.
ఈ సందర్భంగా ఆ తీర్థంలో స్నానం చేసేవారికి వారి కోరికల మేరకు అనుగ్రహం లభిస్తుందని అమ్మవారు వరమిచ్చినట్లు పురాణం వివరిస్తోంది. ఈ కారణంగా ఆ ప్రాంతానికి ఫాల్గుణ తీర్థం అనే పేరు వచ్చిందని, మహర్షులు ఆ ప్రాంతాన్ని తమ నివాసంగా ఎంచు కున్నారని కథనం చెబుతోంది. ఇతర దేవతలు కూడా స్వామి వారికి సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. జాబాలి మహర్షి ఆలయానికి వాయవ్య దిశలో ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యులతో కలిసి అక్కడ నివసించారు. అగస్త్య మహర్షి కొండకు దక్షిణంగా స్వర్ణముఖి నది తీరంలో పూలతోటను పెంచి, అక్కడి పూలతో స్వామివారిని నిత్యం పూజించేవారని పురాణం చెబుతోంది. ఇలా అనేక మంది మహర్షులు, దేవతలు వేంకటాచలాన్ని తమ నివాస ప్రాంతంగా ఎంచుకున్నట్లు పురాణ గాథ తెలియజేస్తోంది.
కలియుగంలోనూ స్వామివారి దివ్య వైభవం
వేంకటాచలంపై స్వామివారు ఏ రూపంలో కొలువుదీరుతారు? కలి యుగంలో భక్తులకు ఎలాంటి అనుగ్రహం కల్పిస్తారు? అనే అంశాలపై కూడా వరాహ పురాణం వివరణ ఉంది. కలియుగంలో సామాన్య మాన వులకు స్వామివారి దివ్యరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాక పోయినా, ఆలయంలోని విగ్రహ రూపంలో స్వామివారు భక్తులకు దర్శన మిస్తారని పురాణం చెబుతోంది. వైకుంఠం నుంచి వచ్చిన దివ్య విమానం కాలక్రమంలో అంతర్ధానమవుతుందని, స్వామివారి భక్తులు కొండపై ఆలయాన్ని నిర్మించి ఆయనను పూజిస్తారని వివరిస్తోంది.
కలియుగంలో మానవులు స్వామివారి దివ్య మహిమలను పూర్తిగా తెలుసుకోలేక పోయినా, భక్తితో చేసే చిన్నపాటి సేవలు, దానధర్మాలు, పూజల తోనూ స్వామివారు సంతృప్తి చెందుతారని పురాణ గాథ పేర్కొంటోంది. భక్తుల కోరికలు తీర్చడం, వారిని కష్టాల నుంచి రక్షించడం, ధర్మ మార్గంలో నడిపించడం స్వామివారి అను గ్రహంలో భాగమని వివరి స్తోంది. స్వామి వారికి ధనం, ఇతర వస్తువులపై ఎలాంటి ఆశ ఉండదని, భక్తుల సంక్షే మమే ఆయనకు ముఖ్యమని ఈ కథనం స్పష్టం చేస్తోంది.
కలియుగంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొటున్నాయి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వేంకటేశ్వరుడిని ఆరాధించే భక్తులకు సుఖసంతోషాలు కలుగుతాయని, బ్రహ్మదేవుడు ప్రారంభించిన బ్రహ్మోత్స వాల వెనుక ఉన్న ఈ పురాణ గాథలో భక్తి, సేవ, దానం, ధర్మం, దైవానుగ్రహం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. అందుకే నేటికీ తిరుమల బ్రహ్మోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి.
జగదీష్ జంగం, తిరుమల
బ్రహ్మాండమైన ఏర్పాట్లు
స్వామివారి ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా సమష్టి కృషితో విజయవంతం చేస్తాం. ఓవైపు దసరా సెలవులు, మరోవైపు తమిళ భక్తులకు పవిత్రమాసమైన పెరటాశి కావడంతో భక్తులు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా వచ్చే అవకాశం ఉంది. భక్తులకు మూలవిరాట్టు, వాహనసేవల దర్శనంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేపట్టాం. స్వామిపై భక్తివిశ్వాసాలతో తిరుమలకు వచ్చి నవరాత్రి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఆస్వాదించి స్వామి అనుగ్రహం పొందాలని కోరుతున్నా.
బీఆర్ నాయుడు, చైర్మన్, టీటీడీ
‘హ్యాండ్‌బుక్’లో అన్ని వివరాలు...
స్వామికొలువైన తిరుమల కొండకు వచ్చే ప్రతీ ఒక్క భక్తునికి సంతృప్తికరమైన శ్రీవారు, వాహనసేవల దర్శనమే లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘హ్యాండ్‌బుక్’ రూపొందించాం. ఇందులో... ఎలాంటి ఏర్పాట్లు చేయాలి. ఉత్సవాల సమయంలో ఎలాంటి విధులు నిర్వహించాలి. ఏఏ సమయంలో భక్తులకు అందించాల్సిన సేవలు ఏంటి వంటి వివరాలుస్పష్టంగా ఉంటాయి. ఈ హ్యాండ్‌బుక్ ద్వారా ప్రతీ విభాగానికి సంబంధించిన సమాచారం, వారు వ్యవహరించాల్సిన తీరు స్పష్టంగా ఉంటుంది. ఇది భవిష్యత్ తరాలకూ ఉపయోగపడుతంది. గతరెండేళ్లలో ఏన్నో మార్పులకు శ్రీకారం చుట్టాం. విద్యుత్, పుష్పా లంకరణల్లో అద్భుత మార్పులు చేపట్టడంతో పాటు బెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. భక్తుల వద్దకే సేవలు అనే నినాదంతో సమిష్టిగా పనిచేస్తున్నాం.
సీహెచ్ వెంకయ్య చౌదరి, అదనపు ఈవో, టీటీడీ
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో...
స్వామివారి వాహన వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసేందుకు కృషి చేస్తున్నాం. తిరుమలకు చేరేవారితో పాటు ప్రపంచంలో ఏమూల భక్తుడున్నా శ్రీవారి వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు ఈసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలను భక్తులకు అందజేస్తున్నాం. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం క్షేత పవిత్రతను, గొప్పదనాన్ని, విశిష్టతను భక్తులకు తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాల ప్రసారాలకూ రూపకల్పన చేస్తున్నాం.
శ్రీధర్‌వర్మ, చైర్మన్, ఎస్వీబీసీ
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!
Read Latest AP News And Telangana News And International News And Telugu News