Share News

కెనడాలో తెలుగు మహిళ ప్రచార హోరు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:22 AM

కెనడాలోని మిస్సిసాగా మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీకి చెందిన మహిళ, కెనడియన్‌ రాజకీయ నాయకురాలు దీపిక దామెర్ల వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.

కెనడాలో తెలుగు మహిళ ప్రచార హోరు
deepika

  • మిస్సిసాగా మేయర్‌గా దీపిక పోటీ

  • హామీలు, పాటలతో ఓటర్లకు చేరువ

న్యూఢిల్లీ, అక్టోబరు 10: కెనడాలోని మిస్సిసాగా మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీకి చెందిన మహిళ, కెనడియన్‌ రాజకీయ నాయకురాలు దీపిక దామెర్ల వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒకవైపు హామీలు ఇస్తూ.. మరోవైపు సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ గీతాలను తనదైన శైలిలో మార్చి ఆలపిస్తున్నారు. ఏపీలో జన్మించిన దీపిక.. అనంతరకాలంలో కెనడాలో స్థిరపడ్డారు. అక్కడే ఆమె పౌరసత్వం కూడా పొందారు. ప్రస్తుతం జరుగుతున్న మిస్సిసాగా మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దీపిక.. బాలీవుడ్‌ గీతం ‘క్యాహువా తేరా వాదా’(నీ హామీ ఏమైంది?)ను ‘నా హామీ నిలబెట్టుకుంటా..’ అని మార్చి.. ఆలపిస్తున్నారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనను గెలిపిస్తే స్థిరాస్తి పన్నుల భారం పెంచబోనని హామీ ఇస్తున్నారు. ఈ ప్రచారం ఓటర్లను అమితంగా ఆకర్షిస్తోంది. కెనడా రాజకీయాల్లో దీపిక కీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు. మేయర్‌గా పోటీ చేయకముందు మిస్సిసాగా నగర కౌన్సిలర్‌గా పనిచేశారు. స్థానిక సంస్థల్లో కీలక బాధ్యతలు కూడా చేపట్టారు.

Updated Date - Oct 11 , 2026 | 06:27 AM