Share News

భారత్‌ ప్రజాస్వామ్య దేశం.. వలసరాజ్యం కాదు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:19 AM

అమెరికా బిలియనీర్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

భారత్‌ ప్రజాస్వామ్య దేశం.. వలసరాజ్యం కాదు
kamal hasan

  • ఒక దేశ విధానాలను బిలియనీర్లు శాసించకూడదు

  • ఎలాన్‌ మస్క్‌కు కమల్‌హాసన్‌ కౌంటర్‌

చెన్నై, అక్టోబరు 10: అమెరికా బిలియనీర్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘ఒక దేశ విధానాలను బిలియనీర్లు శాసించకూడదు. అది అమెరికన్‌ అయినా, లేక భారతీయుడైనా..’ అని నొక్కి చెప్పారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, అది వలసరాజ్యం కాదని తేల్చిచెప్పారు. నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్‌లు కేవలం కమర్షియల్‌ ఆస్తులే కాదని, అవి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలని భారత్‌కు తెలుసన్నారు. భారతదేశ జాతీయ భద్రతపై రాజీకి తావులేదని ‘ఎక్స్‌’లో కమల్‌ స్పష్టం చేశారు. తన కంపెనీ ‘స్టార్‌లింక్‌’కు భారత్‌లో అనుమతుల విషయంలో జాప్యం జరుగుతోందంటూ మస్క్‌ చేసిన విమర్శలపై కమల్‌హాసన్‌ ఈ విధంగా స్పందించారు. ‘మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి సైతం సరసమైన ధరకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలను ఉపగ్రహం ద్వారా అందించే విషయంలో భారతీయ కంపెనీలతోపాటు అంతర్జాతీయ ప్రొవైడర్ల నుంచి పోటీని భారత్‌ తప్పక ఆహ్వానించాలి. అయితే, ప్రతి దేశం సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది’ అని కమల్‌ తేల్చి చెప్పారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే పశ్చిమదేశాలు స్వేచ్ఛా మార్కెట్ల గురించి ఉపన్యాసాలు ఇవ్వకూడదన్నారు. ‘స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు చైనా ఈవీలపై అమెరికా 100 శాతం టారి్‌ఫలు విధించింది. అదే విధంగా భారతదేశం తమ స్వదేశీ తయారీదారుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంది’ అని పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 06:28 AM