Share News

సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:39 AM

ఏది నిజం? ఏది అబద్ధం! అని ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు నమ్మాలి? ఇంత పెద్ద దేశంలో ఏది సత్యమో? ఏది అసత్యమో? చెప్పగలిగే వ్యవస్థే లేదా? ప్రజలలో విశ్వాసం నింపగలిగే వ్యవస్థ ఒక్కటి కూడా మిగలలేదా?...

సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!

ఏది నిజం? ఏది అబద్ధం! అని ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు నమ్మాలి? ఇంత పెద్ద దేశంలో ఏది సత్యమో? ఏది అసత్యమో? చెప్పగలిగే వ్యవస్థే లేదా? ప్రజలలో విశ్వాసం నింపగలిగే వ్యవస్థ ఒక్కటి కూడా మిగలలేదా? ప్రభుత్వాలకు భయపడుతూనో లేక ప్రభుత్వాలను తిట్టుకుంటూనో బతికేయాలా? ఓటర్ల జాబితా నిశిత పరిశీలన పేరిట ఓట్ల చోరీ జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం ఉందా? ఈ అంశంపై ప్రభుత్వంగానీ, ఎన్నికల కమిషన్‌గానీ ఎందుకు నోరు మెదపడం లేదు? ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతున్నప్పటికీ న్యాయ వ్యవస్థ సైతం ఎందుకు మౌనంగా ఉంటోంది? ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును చోరీ చేస్తున్నారని ఆరోపిస్తున్నప్పుడు అందులో నిజం ఉందో లేదో చెప్పాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థలకు లేదా? దేశ ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి! ఎస్‌ఐఆర్‌ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వివాదం ఎందుకు ఏర్పడింది? అన్న ప్రశ్నకు కూడా సమాధానం లభించడం లేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో అటు ప్రతిపక్ష పార్టీలు, ఇటు కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోవడం ఏమిటి? తాము ఆదేశాలు ఇవ్వకపోయినా ఫాం–6లో మార్పులు చేశారని స్వయంగా సుప్రీంకోర్టు చెబుతున్నప్పటికీ... ఆ విషయమై దేశ ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు లేదా? దేశంలో ఓట్‌ చోరీ జరుగుతోందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అయితే, ఎస్‌ఐఆర్‌ విషయంలో ఎన్నికల కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయని ఒక ఆంగ్ల పత్రిక వార్త ప్రచురించే వరకు ఓటు చోరీ అంశాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ ఎన్నిక సందర్భంగా ఈ ప్రక్రియపై చర్చ తీవ్రంగా వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్వయంగా కోర్టులో వాదించారు. అయితే ఓటర్లను అక్రమంగా తొలగిస్తున్నారన్న ఆధారాలు ఉంటే మళ్లీ తమను ఆశ్రయించవచ్చునని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో తొలగించిన ఓటర్లను ఎన్నికల తర్వాత మళ్లీ జోడించినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూరినట్ట్టయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాలతో కాక్రోచ్‌ జనతా పార్టీ కూడా స్వరం కలిపింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా జ్ఞానేశ్‌ కుమార్‌ అనే ఒక్క వ్యక్తి అనుకుంటే 13 కోట్ల మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించగలరా? ఇంత పెద్ద దేశంలో, ఎన్నికల కమిషన్‌ అజమాయిషీలో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తారు. జ్ఞానేశ్‌ కుమార్‌ కోరుకున్నంత మాత్రాన వాళ్లందరూ తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడతారా?


ఏపీలో ఎన్నికలు జరిగిన ఇన్నాళ్లకు...

సందట్లో సడేమియా అన్నట్టుగా 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా ఫలితాలు తారుమారు అయ్యాయని కొందరు ఆరోపించడం మొదలెట్టారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు ఉంటే ప్రజల్లో అశాంతి ఏర్పడదా? ‘దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమను’ అన్న చందంగా కొంత మంది స్వరం కలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విషయమే తీసుకుందాం! ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికల విధుల్లో లక్షలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారిలో తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు వైసీపీ అభిమానులు కూడా ఉంటారు కదా? ఉన్న ఓట్ల సంఖ్య కంటే అధికంగా ఓట్లు పోలైనట్టుగా రికార్డులు సృష్టించినా, ఈవీఎంలలో మార్పులు చేసినా వైసీపీ అభిమానులు ఊరుకుంటారా? ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్‌ చేయడం, దొంగ ఓట్లు వేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు సరికొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం ఓట్లు ఎన్ని? పోలైన ఓట్లు ఎన్ని? అన్నది సరిచూసుకొని ప్రిసైడింగ్‌ అధికారి సంతకం చేస్తారు. బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరిగినప్పుడు ఓట్ల రిగ్గింగ్‌ జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈవీఎంల వాడకం మొదలయ్యాక రిగ్గింగ్‌ ఆరోపణలు తెరమరుగయ్యాయి. అయితే ఓడిన పార్టీలు ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంల గోల్‌మాల్‌ జరిగిందని కొద్ది రోజులు ఆరోపించి, ఆనక మౌనంగా ఉండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు పూర్తవుతున్న వేళ ప్రజా తీర్పును తారుమారు చేశారన్న వాదనలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సహా ఆయనకు మద్దతు ఇస్తున్న వారందరూ ఈ వాదనలను నమ్ముతున్నారు. జగన్‌రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారన్న వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారు. బటన్లు నొక్కడం ద్వారా జగన్‌రెడ్డి అద్భుతమైన పాలన అందించారని ఇలాంటి వారంతా బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో జగన్‌రెడ్డి ఓడిపోలేదనేదాకా ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి రాజకీయ పార్టీలు ఏవేవో చెబుతుంటాయి. నిజానికి వారు కూడా తమ వాదనలను సీరియస్‌గా తీసుకోరు. అయితే మేధావులు, తటస్థ వాదులమని చెప్పుకొనేవారు కూడా ఈవీఎంల గోల్‌మాల్‌ జరిగిందని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. 2019 ఎన్నికల తర్వాత ఓటమి నెపాన్ని ఈవీఎంలపై వేయడానికి చంద్రబాబు ప్రయత్నించినప్పుడు ఎగతాళి చేసినవాళ్లు కూడా ఇప్పుడు ఈవీఎంలను నిందించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ‘ఎన్నికల్లో మేమే గెలిచాం లేదా ఫలానా వాళ్లు గెలిచారు. గెలిచినవాళ్లే పరాజితులు’ అని చెప్పుకోవడం వల్ల ఆత్మానందం లభిస్తే లభించవచ్చునుగానీ సామాన్య ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకం పోతుందన్న వాస్తవాన్ని మేధావులుగా చలామణి అవుతున్న వాళ్లు ఆలోచించాలి కదా!

2-Untitled-1.jpg


అదే జరిగి ఉంటే...

జాతీయ స్థాయిలో ఓట్‌ చోరీ జరుగుతోందన్న ఆరోపణల విషయానికి వద్దాం! ఇందులో ఎంత నిజం ఉంది? ఎన్నికల కమిషనే ఈ అక్రమానికి పాల్పడుతోందా? లేక రాజకీయ పార్టీలు ఆ పని చేస్తున్నాయా? అన్నది తేలాల్సి ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పని చేయిస్తున్నారన్నది ప్రతిపక్షాల తాజా ఆరోపణ. ఓట్ల చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ వరుస విజయాలు సాధిస్తోందన్న ఆరోపణలే నిజమైతే 2024లో బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లు సాధించలేకపోవడం ఏమిటి? ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పుకున్నట్టుగా సొంతంగా 400 సీట్లు గెలవడానికి ఎవరు అడ్డొస్తారు? ఇలాంటి సందేహాల నడుమ ప్రతిపక్షాల ఆరోపణల్లో పస లేదేమోనన్న సందేహం కలుగుతోంది. అయితే, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా అక్రమ వలసదారులు, డూప్లికేట్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారు. మన దేశంలో పలువురికి ఒకచోటికంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటోంది. హైదరాబాద్‌ విషయమే తీసుకుందాం! తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారిలో అత్యధికులకు తమ స్వస్థలాలతో పాటు హైదరాబాద్‌లో కూడా ఓటు హక్కు ఉంటోంది. ఎస్‌ఐఆర్‌ వల్ల ఇలాంటి వారి ఓట్లు తొలగిపోతాయి. జరగాల్సింది ఇదే! అయితే రాజకీయ పార్టీల కుయుక్తుల వల్ల ఓట్ల తొలగింపు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం వారి ఓట్ల తొలగింపుపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ పాత్ర ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఒక్కరే దేశవ్యాప్తంగా ఓట్లు తొలగించలేరు కదా? లక్షలాది మంది బీఎల్‌ఓలు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పాల్గొంటున్నప్పుడు వారిలో అన్ని వర్గాల వారూ ఉంటారు. వాళ్లందరూ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని చెప్పలేం కదా? బీఎల్‌ఓల పనితీరులో లోపాలు ఉంటే ఉండవచ్చునుగానీ మొత్తం ప్రక్రియ అపసవ్యం అని చెప్పలేని పరిస్థితి. శుక్రవారం నాడు కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అన్ని చోట్లా అధికార పార్టీయే గెలిచింది. తమిళనాడు విషయమే తీసుకుందాం! తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున నెగ్గి ముఖ్యమంత్రి విజయ్‌ పార్టీలో చేరిన ఇద్దరు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే గెలిచింది. ఆ రెండు నియోజకవర్గాలూ అన్నాడీఎంకేకు బలమైన సీట్లు. కానీ ఈ రెండు చోట్లా డీఎంకే ద్వితీయ స్థానానికే పరిమితమైంది. కేంద్రంలో బీజేపీ పెద్దలు, డీఎంకే అధినేతకు మధ్య లోపాయికారీ అవగాహన ఉందని ప్రచారం ఉంది. అలాంటప్పుడు అక్కడ ఫలితాలు డీఎంకేకు అనుకూలంగా రావాలి కదా? కానీ అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి కదా? ఈ నేపథ్యంలోనే ఓట్‌ చోరీపై ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మాలో, ఎన్నికల కమిషన్‌ చెబుతున్నది నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. సందేహాలు నివృత్తి చేయవలసినవారు మౌనంగా ఉండిపోవడంతో అనుమానాలు బలపడటం సహజం.

4-ed.jpg


ఏది పరిష్కారం...

ప్రతిపక్షాలతోపాటు కాక్రోచ్‌ జనతా పార్టీ తలపెట్టిన ఆందోళనను పోలీసు బలగాలను ప్రయోగించి అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదు. ఎస్‌ఐఆర్‌ విషయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో మిగతా ఇద్దరు కమిషనర్లు తీవ్రంగా విభేదించినట్టు వచ్చిన వార్తలపైన అయినా స్పష్టత ఇవ్వాలి కదా? ఓట్‌ చోరీపై పిటిషన్లు దాఖలైనప్పుడు సుప్రీంకోర్టు అయినా సీరియస్‌గా తీసుకొని ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదేమో! మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి రావాలని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నిజమే, మహిళల విషయంలోనే కాదు ఎటువంటి నేరం చేయాలనుకునే వారైనా భయపడే పరిస్థితి ఉండాలి. అయితే, అలాంటి పరిస్థితి ఉండాలంటే సంబంధిత వ్యవస్థలలో జవాబుదారీతనం ఉండాలి కదా? వ్యవస్థలన్నీ బాధ్యతతో, జవాబుదారీతనంతో పనిచేస్తే నేరస్థుల వెన్నులో వణుకు పుట్టదా? వ్యవస్థలలో జవాబుదారీతనం లోపించడం వల్లనే నేరస్థులు రొమ్ము విరుచుకొని తిరగగలుగుతున్నారు. ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న భావన ఏర్పడిన విషయం వాస్తవం కాదా? ఈ పరిస్థితికి న్యాయ వ్యవస్థ ప్రధాన బాధ్యత తీసుకోవాలి. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఉదంతమే తీసుకుందాం. ఈ హత్య వెనుక కర్త కర్మ క్రియ ఎవరో అందరికీ తెలిసిందే. దర్యాప్తు సంస్థ సీబీఐకి మాత్రం తెలుసుకొనే ఆసక్తి ఉండదు. అందుకు మరెవరో కారణమని అంటారు. మరోవైపు కేసు విచారణలో పురోగతి ఉండదు. అంటే హత్య కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం గానీ, సీబీఐ గానీ, న్యాయ వ్యవస్థ గానీ బాధ్యతగా వ్యవహరించడం లేదని ఎవరైనా భావిస్తే తప్పు ఎలా అవుతుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై దాఖలైన అవినీతి కేసుల విషయం కూడా అంతే. ఇలాంటి కేసుల విచారణలో అతీ గతీ లేకపోవడం, ఏళ్లూ పూళ్లూ గడచినా నేరస్థులకు శిక్ష పడకపోవడం వల్ల వ్యవస్థలంటే లెక్కలేనితనం వస్తోంది. ఈ దేశంలో ఎటువంటి నేరం చేసినా డబ్బు, పలుకుబడి ఉంటే శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు అన్న భావన దేశ ప్రజలలో నానాటికీ బలపడుతోంది. ఈ పరిస్థితికి తాము ఎంత కారకులమో ఆయా వ్యవస్థలకు చెందినవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించడం వల్ల ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు కూడా అపసవ్యంగా ఉంటున్నాయి. రాజకీయ పార్టీల ఉచితాల జాతరలో తమకు నిజంగా ఏమి కావాలో తెలుసుకోలేని స్థితిలోకి ప్రజలు వెళ్లిపోతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో వసతుల కొరతపై ఫ్రాన్స్‌ దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చిన్న పిల్లలు వీధుల్లోకి వస్తున్నారు. ఇదే అంశంపై కాక్రోచ్‌ జనతా పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే ఆందోళనలకు పిలుపునిస్తే స్పందన కరువైంది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో సీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళనకు కూడా మద్దతు లభిస్తోంది. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్‌– ఇప్పుడు జ్ఞానేశ్‌ కుమార్‌. వ్యక్తులు కేంద్రంగా ఆందోళనలు చేపడితేనే మద్దతు లభిస్తుందా? ప్రజల సామూహిక ప్రయోజనాల కోసం ఉద్యమాలకు పిలుపునిస్తే పట్టించుకోరా? ఈ ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ధర్మేంద్ర ప్రధాన్‌, మరో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసినంత మాత్రాన వ్యవస్థలు బాగుపడతాయా? వ్యవస్థలపై తాత్కాలికంగా ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఇలాంటి ఆందోళనలు ఉపయోగపడతాయి. కొన్ని అంశాలపై మాత్రమే ప్రజల్లో స్పందన ఉండటం వాంఛనీయం కాదు.


జవాబుదారీతనం.. భయం ఉండాలి!

నేరం చేయాలనుకునే వారిలోనే కాదు– వ్యవస్థల్లో కూడా భయం ఉండాలి. తాము బాధ్యతతో, జవాబుదారీతనంతో పనిచేయకపోతే ప్రజల్లో అలజడి ఏర్పడుతుందన్న భయం ఆయా వ్యవస్థల అధిపతుల్లో ఏర్పడాలి. ఎన్నికల కమిషన్‌ విషయమే తీసుకుందాం. ఎన్నికల కమిషన్‌ ఈ దేశ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వ పెద్దలకు కాదు. న్యాయ వ్యవస్థ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మిగతా ప్రభుత్వ విభాగాలు బాధ్యతతో పనిచేయని పక్షంలో తాము సహించబోమన్న సంకేతాలను న్యాయ వ్యవస్థ పంపించాలి కదా? నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలైన తర్వాత న్యాయ వ్యవస్థలో కూడా మార్పు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా సర్వోన్నత న్యాయ స్థానం వైఖరిలో అది స్పష్టమవుతోంది. ప్రజలు రోడ్డెక్కుతారన్న భయం ఉన్నప్పుడే వ్యవస్థలు జవాబుదారీతనంతో పనిచేస్తాయన్న భావన దీనివల్ల ఏర్పడుతోంది. గుడ్డికంటే మెల్ల నయం అన్నట్టుగా ప్రజాందోళనల వల్లనైనా వ్యవస్థలలో ఉలికిపాటు రావడం ముదావహమే. అయితే వ్యవస్థలు ఇంతలా దిగజారడానికి కారణం రాజకీయ పార్టీలే! అంటే ప్రభుత్వాలు! ఇకపై ప్రజాందోళనలకు ప్రభుత్వాలు భయపడాలి. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు సహించబోరన్న భయం ప్రభుత్వాలలో ఏర్పడాలి. అలా జరగాలంటే రాజకీయాలకు అతీతంగా విజిల్‌ బ్లోయర్లు పుట్టుకురావాలి. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా విజిల్‌ బ్లోయర్లు పనిచేస్తే ప్రభుత్వాలు భయపడకుండా ఎలా ఉంటాయి? ఓట్‌ చోరీ వంటి వివాదాలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి? ప్రభుత్వాధినేతల సేవలో తరించే వ్యక్తుల స్థానంలో బాధ్యతగా మెలిగేవారు ఆయా వ్యవస్థల అధిపతులుగా ఉంటారు కదా? వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం అత్యంత ప్రమాదకరం. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయలేకపోతే అంతిమంగా దేశ ప్రయోజనాలు కూడా ప్రమాదంలో పడతాయి. ఓట్ల తొలగింపు అంశంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఇప్పుడు ఎవరు నివృత్తి చేయాలి? ఎన్నికల కమిషన్‌, కేంద్ర ప్రభుత్వ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ప్రజల్లో ఇప్పటికీ అంతో ఇంతో విశ్వసనీయత ఉన్న న్యాయ వ్యవస్థ ఈ బాధ్యత ఎందుకు తీసుకోకూడదు? ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల ప్రక్రియ పైనే నీలి నీడలు కమ్ముకున్న వేళ వాటిని తొలగించని పక్షంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఈ కారణంగా ఓట్ల చోరీ అంశంలో నిజమేమిటో సందేహాలకు అతీతంగా నివృత్తి చేసే బాధ్యతను సర్వోన్నత న్యాయ స్థానం చేపట్టాలి.


జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు. తప్పు జరిగి ఉంటే జ్ఞానేశ్‌ కుమార్‌కు బదులు మరొకరు వచ్చి అదే తప్పును మరింత విస్తృత స్థాయిలో కొనసాగించవచ్చు కదా? అందుచేత ముందుగా అసలు తప్పు జరిగిందో లేదో నిర్ధారించాలి. తప్పు జరిగి ఉంటే... అలాంటి తప్పు ఇంకెప్పుడూ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండనే ఉంటుంది. నిజంగా తప్పు జరిగి ఉంటే అలాంటి తప్పు మరెవరూ చేయకుండా ఉండే విధంగా నేరస్థులను శిక్షించాలి. ఉద్యమాలకు పిలుపు ఇస్తున్న వారు కూడా వ్యక్తులను కాకుండా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని పోరాడాలి. బలగాల సాయంతో ఆందోళనలను అణచివేయాలన్న ఆలోచనలకు ప్రభుత్వ పెద్దలు కూడా స్వస్తి చెప్పి ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించే ప్రయత్నం చేయాలి!

ఆర్కే

ఇవీ చదవండి:

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్

Updated Date - Oct 11 , 2026 | 12:40 AM