స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 01 , 2026 | 08:23 PM
విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పని వేళల్లోనే గాఢంగా నిద్రపోతూ కనిపించారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్.. స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయారు. సంబంధిత వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కరౌలీ జిల్లా తొడాభీమ్ ప్రాంతంలోని భండారీ అండ్రూని గవర్నమెంట్ హైస్కూల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో స్కూల్ గదిలో ఓ వ్యక్తి గాఢంగా నిద్రపోతూ కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి స్కూల్ ప్రిన్సిపాల్ ద్యోడిరామ్ మీనా అని గుర్తించారు. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్థానిక విద్యాశాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సదరు ప్రిన్సిపాల్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లూ తెలయరాలేదు.
మరో ఘటన..
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దాసావాస్‌లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన భారీ స్టీల్ పాత్రలను మోస్తున్న వీడియో బయటకు వచ్చింది. భోజనం చేయాల్సిన సమయంలో అక్కడి ఉపాధ్యాయులు నిద్రపోతూ.. పిల్లలతో ఇలా పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!
‘మేడే’ షో చూసి.. 174 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.!