Share News

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:41 PM

ముంబై 26/11 ఉగ్రదాడులు.. దేశం ఎన్నటికీ మర్చిపోలేని విషాద గాథ. ఆ దాడుల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న రెండేళ్ల ఇజ్రాయెలీ బాలుడు మోషేను ప్రాణాలకు తెగించి కాపాడిన భారతీయ నానీ సాహసం ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది.

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంలో కొన్ని ఘటనలు మానవీయ కోణంలోనూ ప్రత్యేకంగా నిలుస్తాయి. 18 ఏళ్ల క్రితం ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఓ భారతీయ నానీ తన ప్రాణాలను పణంగా పెట్టి రెండేళ్ల ఇజ్రాయెల్ బాలుణ్ని రక్షించారు. తాజాగా.. ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనలో భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ చూపిన ధైర్యంతో ఆమె సాహసం మరోసారి తెరమీదకు వచ్చింది.


నాడు ఏం జరిగింది?

2008 నవంబర్‌ 26న ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఇ-తొయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. సుమారు 60 గంటలపాటు సాగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. అంతేకాకుండా కొలాబాలోని యూదుల ప్రార్థన, సామాజిక కేంద్రం నరీమన్‌ హౌస్‌(చాబాద్‌ హౌస్‌)పై కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అక్కడ రబ్బీ గావ్రియేల్‌ హోల్ట్జ్‌బర్గ్‌, ఆయన భార్య రివ్కా సహా పలువురు హత్యకు గురయ్యారు. అయితే.. వారి రెండేళ్ల కుమారుడు మోషే మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు కారణం అతని నానీ సాండ్రా శామ్యూల్.


నరీమన్‌ హౌస్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించిన సమయంలో సాండ్రా అక్కడే ఉన్నారు. కాల్పుల శబ్దాల నడుమ మరో ఉద్యోగి ఖాజీ జాకీర్‌ హుస్సేన్‌తో పాటు ఆమె ఓ గదిలో తలదాచుకున్నారు. కొద్దిసేపటికి చిన్నారి మోషే ఏడవడం ప్రారంభించాడు. అది విని.. సాండ్రా, హుస్సేన్‌ వెంటనే పైకి వెళ్లారు. అక్కడ మోషే తల్లిదండ్రులు మృతిచెందినట్లు గుర్తించారు. తల్లిదండ్రుల మృతదేహాల పక్కన ఏడుస్తున్న బాలుణ్ని సాండ్రా ఎత్తుకుని.. ఉగ్రవాదులు ఇంకా అక్కడే ఉన్నప్పటికీ బయటకు పరుగులు తీశారు. దీంతో మోషే ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆ తర్వాత మోషేను ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు సాండ్రా. అక్కడ అతడు తన తాతయ్య, ఇతర కుటుంబ సభ్యుల సంరక్షణలో పెరిగాడు. సాండ్రా కూడా మోషేతో అనుబంధాన్ని కొనసాగించారు. ఈ సాహసానికి గుర్తింపుగా 2010లో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆమెకు ఆ దేశ పౌరసత్వం మంజూరు చేసింది.


18 ఏళ్ల తర్వాత మళ్లీ..

2008లో సాండ్రా శామ్యూల్‌ ఉగ్రవాదుల మధ్య నుంచి చిన్నారి మోషేను కాపాడారు. తాజాగా ఫ్లైదుబాయ్‌ విమానంలో భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ కూడా అదే తరహా ధైర్య సాహసాలను ప్రదర్శించారు. తను తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ డోర్ తెరిచి ప్రయాణికులకు సాయం చేసేందుకు వెసులుబాటు కల్పించారు. రెండు ఘటనలు వేరైనప్పటికీ.. 18 ఏళ్ల వ్యవధిలో ఇజ్రాయెలీల ప్రాణాలకు ముప్పు వచ్చిన రెండు సందర్భాల్లోనూ.. భారతీయుల ధైర్యమే నిలిచిందనే కోణంలో ఇప్పుడు మరోసారి చర్చ జోరందుకుంది.


ఇవీ చదవండి:

‘మేడే’ షో చూసి.. 174 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.!

కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్‌ పోస్టులు.. నెలకు రూ.16,650 స్టైపెండ్!

Updated Date - Oct 01 , 2026 | 06:43 PM