కెనరా బ్యాంకులో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. నెలకు రూ.16,650 స్టైపెండ్!
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:21 PM
కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక ఏడాదికి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 12 నెలల శిక్షణతో నెలకు రూ.16,650 స్టైపెండ్ లభిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్ హోల్డర్లకు కెనరా బ్యాంక్ చక్కటి అవకాశం కల్పిస్తోంది. 2026-27 ఆర్థిక ఏడాదికి సంబంధించి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు.. 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2026 సెప్టెంబర్ 1 నాటికి వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్-క్రీమీలేయర్) వారికి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇప్పటికే అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారు కానీ, విద్యార్హత పూర్తై ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం వేరే ఉద్యోగం చేస్తున్నవారు కానీ దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.
12 నెలల శిక్షణ.. రూ.16,650 స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ ఇస్తారు. ఎంపికైన బ్యాంకు శాఖల్లో ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.16,650 స్టైపెండ్ లభిస్తుంది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంటుంది. అయితే.. అప్రెంటిస్‌లను కెనరా బ్యాంక్ రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించదు. ఉద్యోగులకు లభించే బెనెఫిట్స్ వీరికి వర్తించవు. శిక్షణ పూర్తయ్యాక రెగ్యులర్ ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా బ్యాంకుపై ఉండదని గమనించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకుని తమ ప్రొఫైల్‌ను నింపాలి. ఆ తర్వాత వచ్చే ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో కెనరా బ్యాంక్ అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ విభాగంలోకి వెళ్లి 2026-27 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాలి. ఫొటో, సంతకం, థంబ్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మొదలగు వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.500 కాగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు.
ఎలా ఎంపిక చేస్తారు?
ఎంపిక ప్రక్రియలో రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తారు. సాధారణ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. మెరిట్ అనంతరం ధ్రువపత్రాల పరిశీలనతో పాటు అవసరాన్ని బట్టి లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
అభ్యర్థులు ఈ నెల 17లోగా దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తులో నమోదు చేసే వివరాలు విద్యార్హత ధ్రువపత్రాల్లో ఉన్న వివరాలతో సరిపోలేలా చూసుకోవాలి. అలాగే అప్లై చేస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషా అర్హతను తప్పనిసరిగా పరిశీలించాలి.
దరఖాస్తు చేసుకునే ముందు కెనరా బ్యాంక్ అధికారికంగా విడుదల చేసిన Graduate Apprentice Recruitment 2026-27 నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. అందులో రాష్ట్రాల వారీగా ఖాళీలు, అర్హతలు, ఫీజు, ఎంపిక విధానం, ఇతర ముఖ్యమైన నిబంధనలన్నీ ఉంటాయి.
ఇవీ చదవండి:
ఈ టీచర్...పట్టుదలకు మారుపేరు!
రైల్వేలో 5,165 నాన్-టెక్నికల్ పోస్టులు..