Share News

రైల్వేలో 5,165 నాన్‌-టెక్నికల్‌ పోస్టులు..

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:43 PM

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్‌ రానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (NTPC)లో గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగాల్లో మొత్తం 5,165 పోస్టులను భర్తీ చేయనుంది.

రైల్వేలో 5,165 నాన్‌-టెక్నికల్‌ పోస్టులు..
RRB NTPC Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం అందుబాటులోకి రానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (NTPC)లో గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగాలకు సంబంధించి మొత్తం 5,165 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనలు ఇప్పటికే విడుదలయ్యాయి. దరఖాస్తుల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా ప్రకటించారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ అందుబాటులోకి రానుంది.

గ్రాడ్యుయేట్‌ కేటగిరీలో 3,477 పోస్టులు

NTPC గ్రాడ్యుయేట్‌ విభాగంలో మొత్తం 3,477 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగంలో చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌, స్టేషన్‌ మాస్టర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.


దరఖాస్తు తేదీలు

గ్రాడ్యుయేట్‌ కేటగిరీకి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 8, 2026 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నవంబర్‌ 6, 2026 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగంలో 1,688 ఖాళీలు

12వ తరగతి లేదా ఇంటర్‌ చదువు పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా NTPCలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కేటగిరీలో మొత్తం 1,688 పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు అర్హులు. కొన్ని ఉద్యోగాలకు అదనంగా కంప్యూటర్‌ టైపింగ్‌ నైపుణ్యం అవసరం ఉంటుంది. ముఖ్యంగా క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ వంటి పోస్టులకు ఇంగ్లిష్‌ లేదా హిందీ టైపింగ్‌ పరిజ్ఞానం అవసరం కావచ్చు. ఈ కేటగిరీలో అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, ట్రైన్స్‌ క్లర్క్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.


వయోపరిమితి

అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలకు వర్తించే వయో సడలింపులు పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొంటారు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు తేదీలు

ఈ విభాగానికి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ అక్టోబర్‌ 15, 2026న ప్రారంభం కానుంది. దరఖాస్తులకు నవంబర్‌ 13, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

దరఖాస్తు ఎలా చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నమోదు చేయాలి.

ముఖ్యమైన విషయం

NTPC గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో రైల్వే జోన్‌ల వారీగా ఖాళీలు, దరఖాస్తు ఫీజు, వయోపరిమితి సడలింపులు, ఎంపిక విధానం, పరీక్షా విధానం తదితర అంశాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు RRB అధికారిక వెబ్‌సైట్‌లో వెలువడే పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించడం అవసరం.

Also Read:

బయట కొనడం ఎందుకు.. కొబ్బరి నూనెను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.!

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

Updated Date - Sep 28 , 2026 | 06:43 PM