బయట కొనడం ఎందుకు.. కొబ్బరి నూనెను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.!
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:56 PM
ఇంట్లో కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి నూనెను వంటల్లోనే కాకుండా జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా చాలామంది ఉపయోగిస్తుంటారు. బయట కొనుగోలు చేసే నూనె విషయంలో నాణ్యతపై సందేహాలు ఉన్నవారు ఇంట్లోనే కొబ్బరికాయలతో నూనె తయారు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో తయారీ, నిల్వ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
కొబ్బరి నూనె తయారీకి కావాల్సినవి
1 లేదా 2 పాత కొబ్బరికాయలు
అవసరమైనంత వేడినీరు
పెద్ద పాత్ర
శుభ్రమైన గుడ్డ లేదా వడపోత
శుభ్రమైన, పొడి సీసా
కొబ్బరి నూనె తయారు చేసే విధానం
ముందుగా కొబ్బరికాయలను పగలగొట్టి లోపల ఉన్న గుజ్జును తీసుకోవాలి. గుజ్జును మెత్తగా తురుముకోవాలి. అందులో కొద్దిగా వేడినీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఆ తర్వాత అదే తురిమిన కొబ్బరిలో మరికొంత నీరు పోసి మరోసారి గ్రైండ్ చేయాలి.
ఈ కొబ్బరి పాలను మందపాటి పాత్రలో పోసి తక్కువ మంటపై వేడి చేయాలి. అడుగున అంటుకోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. నీరు క్రమంగా ఆవిరైపోతూ కొబ్బరి పాలలోని కొవ్వు వేరుపడుతుంది. కొంత సమయం తర్వాత నూనె ప్రత్యేకంగా కనిపిస్తుంది.
నూనె వేరుపడిన తర్వాత మంటను ఆపి.. అది కొంత చల్లారిన తర్వాత శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి. అనంతరం పూర్తిగా పొడిగా ఉన్న శుభ్రమైన సీసాలో నూనెను నిల్వ చేయాలి.
నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు
కొబ్బరి నూనెలో నీరు లేదా తేమ మిగిలి ఉంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నూనెను పూర్తిగా పొడి, శుభ్రమైన సీసాలో నిల్వ చేయాలి. తేమ పడకుండా జాగ్రత్త వహించాలి.
నూనెలో దుర్వాసన, అసాధారణమైన రంగు లేదా ఫంగస్ కనిపిస్తే దాన్ని ఉపయోగించకపోవడం మంచిది. ఇంట్లో తయారు చేసిన నూనె ఎంతకాలం నిల్వ ఉంటుందనేది తయారీ విధానం, పరిశుభ్రత, నిల్వ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెలల తరబడి తప్పనిసరిగా నిల్వ ఉంటుందని చెప్పలేం.
జుట్టు, చర్మానికి ఉపయోగం
కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కొంతవరకు సహాయపడవచ్చు. అలాగే చర్మానికి రాసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందించడంలో ఉపయోగపడుతుంది. వంటల్లో కూడా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అయితే ఇతర నూనెల మాదిరిగానే దీనిని కూడా తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సెప్టెంబర్-అక్టోబర్‌లో ఊపిరితిత్తులపై ప్రభావం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
యూరిక్ యాసిడ్ ఉన్నవారు పుట్టగొడుగులు తినొచ్చా?