చదువుతో పాటు నైపుణ్యాలూ నేర్పాల్సిందే!
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:42 AM
పిల్లలకు చదువు, ఆటలతో పాటు... అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని నైపుణ్యాలు నేర్పించడం కూడా ఎంతో అవసరం.
పిల్లలకు చదువు, ఆటలతో పాటు... అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని నైపుణ్యాలు నేర్పించడం కూడా ఎంతో అవసరం. ప్రమాదాలనేవి ఎప్పుడు, ఎలా తారసపడతాయో ఎవ్వరూ ఊహించలేరు. ‘అలాంటి సమయాల్లో పిల్లలు భయపడకుండా... పరిస్థితిని అర్థం చేసుకుని, స్పందించేలా అవగాహన కల్పించాల’ని అంటున్నారు సైకాలజిస్టులు. అవి ఏమిటంటే...
ఈ రోజుల్లో ఈత ఒక ముఖ్యమైన నైపుణ్యం. పిల్లలకు తప్పక నేర్పించాలి. నీటి ప్రవాహం, లోతు వంటివి అంచనా వేయ డం నేర్పించాలి. ఈత నేర్చుకున్న పిల్లలో ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈత నేర్చుకోవడం వల్ల పిల్లలకు నీళ్ల పట్ల ఉన్న భయం తొలగిపోతుంది. అలాగే సరస్సులు, నదులు, సముద్రతీరాల వద్ద పాటించాల్సిన భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించాలి.
పిల్లలకు వారి పూర్తి పేరు, ఇంటి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను గుర్తుండేలా చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వంటి సేవలను పొందేందుకు ఎవరిని సంప్రదించాలో చెప్పాలి. ఫోన్‌లో మాట్లాడేటపుడు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎవరు ప్రమాదంలో ఉన్నారు? వంటి ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా చెప్పడం నేర్పించాలి.
చిన్న గాయాలను శుభ్రం చేయడం, రక్తస్రావాన్ని ఆపేందుకు గాయంపై ఒత్తిడి పెట్టడం వంటి ప్రథమ చికిత్స అంశాలను పిల్లల వయసుకు అనుగుణంగా నేర్పించాలి. టీనేజ్‌లో ఉన్నట్టయితే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ప్రాణాలను కాపాడే కార్డియోపల్మనరీ రీసక్సియేషన్ (సీపీఆర్) చేయడం ఎలాగో నిపుణుల చేత శిక్షణ ఇప్పించాలి.
ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బయటకు వెళ్లేందుకు ఏయే మార్గాలను ఎంచుకోవాలో పిల్లలకు ముందుగానే తెలియ జేయాలి. మంటలు చెలరేగినప్పుడు పొగ వల్ల ఇబ్బంది కలగకుండా తడి కర్చీఫ్‌ను ముక్కు దగ్గర పెట్టుకోవడం, లిఫ్ట్ ఉపయోగించకుండా ఉండటం, ఇంట్లో దాక్కోకుండా వెంటనే బయటకు వెళ్లడం వంటి విషయాలను పిల్లలకు విధిగా నేర్పాలి.

పిల్లలకు ప్రాథమిక వంట నైపుణ్యాలను నేర్పించాలి. అంటే గ్యాస్ ఆఫ్ చేయడం, స్టవ్ ఆఫ్ చేయడం వంటివి. కూరగాయలు కట్ చేయించడం, వంటగదిలో పాటించాల్సిన భద్రతా నియమాల గురించి తెలియజేయాలి.
పిల్లలకు చిన్న వయసులోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. రోడ్డు దాటే ముందు రెండు వైపులా చూసి వాహనాలు వస్తున్నాయా లేదా నిర్ధారించు కున్న తర్వాతే దాటాలని చెప్పాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, పాదచారుల మార్గాలు, సైకిల్ నడిపేటప్పుడు పాటించాల్సిన నియమాలు, పార్కింగ్ ప్రాంతాల గురించి వివరించాలి.
పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉండేలా అలవాటు చేయాలి. అనుమానాస్పదంగా అనిపించినప్పుడు అప్ర మత్తంగా ఉండటం, అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే పెద్దలకు తెలియజేయడం నేర్పాలి. పిల్లలకు ఒక కోడ్ వర్డ్ చెప్పాలి. ఆ కోడ్ వర్డ్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలపాలి. అనుమానాస్పద వ్యక్తుల నుంచి రక్షించుకునేందుకు ఇది ఉపకరిస్తుంది.

సోషల్ మీడియా వాడకం పెరిగిన నేపథ్యంలో పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం అత్యవసరం. ఇంటి చిరునామా, పాఠశాల పేరు, పాస్‌వర్డ్‌లు, ఫోన్ నంబర్, లొకేషన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయ కూడదని చెప్పాలి. అనుమానాస్పద లింకులు, నకిలీ సందేశాలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపులపై పిల్లలకు అవగాహన కల్పించాలి.
పిల్లలు బాటిల్స్‌తో ఆడే క్రమంలో క్యాప్ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోలేక పోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. యాంటీ చోకింగ్ డివైజ్ ఎలా ఉపయోగిం చాలి? టీనేజ్ పిల్లలైతే నిపుణుల ఆధ్వర్యంలో చోకింగ్‌కు సంబంధించిన ప్రథమ చికిత్సలో శిక్షణ ఇప్పించాలి.
పిల్లలకు మ్యాప్‌ను చదవడం, దిశలను గుర్తించడం, ముఖ్యమైన ప్రదేశాలను గుర్తు పెట్టుకోవడం వంటి నావిగేషన్‌నైపుణ్యాలను నేర్పాలి. రద్దీ ఉన్న ప్రదేశాల్లో తప్పిపోయి నప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలి. ఎవరిని సహాయం అడగాలో వివరించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?
పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...
Read Latest AP News And Telangana News And International News And Telugu News