Share News

రూ.16 కోట్ల చిట్టీ డబ్బులతో పరారైన కుటుంబం.. లబోదిబోమంటున్న బాధితులు

ABN , Publish Date - Sep 27 , 2026 | 09:54 AM

సైబరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. స్థానికుల నుంచి రూ.16 కోట్లకు పైగా వసూలు చేసి పరారైంది.

రూ.16 కోట్ల చిట్టీ డబ్బులతో పరారైన కుటుంబం.. లబోదిబోమంటున్న బాధితులు
chit fund scam

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నగరంలోని సైబరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. సుమారు 44 మంది వద్ద నుంచి రూ.16 కోట్లు వసూలు చేసి ఉడాయించింది. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ కుటుంబం గుట్టు రట్టైంది.


బాధితుడి కథనం మేరకు.. సైబరాబాద్‌ పరిధిలో అడ్డగుట్టలోని హెచ్ఎంటీ హిల్స్‌లో రమణారెడ్డి, ఆయన భార్య సీత, కుమార్తె హర్షిత రెడ్డి నివాసముండేవారు. కుటుంబసభ్యులంతా స్థానికంగా చిట్టీలు నిర్వహించేవారు. ప్రారంభంలో స్థానికుల నుంచి నెలవారీగా చిట్టీలు వసూలు చేసేవారు. తర్వాత నెమ్మదిగా వ్యాపార అవసరాల కోసం వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు.


ఈ క్రమంలో కేపీహెచ్‌బీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రమణారెడ్డి చిట్టీల పేరుతో రూ.12.70 లక్షలు వసూలు చేశారు. దీంతో పాటు.. వ్యాపారంలో డబ్బులు అవసరమున్నాయంటూ.. 2 శాతం వడ్డీకి మరో రూ.50 లక్షలను అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పునకు పూచీకత్తుగా రమణారెడ్డి భార్య ఐదు పోస్ట్‌డేటెడ్ చెక్కులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రమణారెడ్డి కుటుంబం చిట్టీ డబ్బులను, అప్పుగా ఇచ్చిన డబ్బులను ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇంటికెళ్లి చూడగా.. ఇల్లు ఖాళీ చేసినట్లు తెలిసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్( ఏవోడబ్ల్యూ)లో ఫిర్యాదు చేశారు.


ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా.. బాధితుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. రమణారెడ్డి కుటుంబం 44 మంది నుంచి రూ.16 కోట్లను వసూలు చేసి పరారయ్యినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వారు తెలిపారు.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 27 , 2026 | 10:25 AM