Share News

పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...

ABN , Publish Date - Sep 27 , 2026 | 08:46 AM

తీర్థ యాత్రలు, విహార యాత్రలు, ఆరోగ్య యాత్రలు, ఆహార యాత్రలు, ప్రకృతి యాత్రలు... తాజాగా ఈ కోవలోకి వచ్చి చేరింది ‘గ్లోకేషన్‌’. అంటే... ఇటు వెకేషన్‌ ను అటు చర్మ సంరక్షణనూ కలిపే టూర్లన్నమాట.

పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...
World Tourism Day

  • నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

తీర్థ యాత్రలు, విహార యాత్రలు, ఆరోగ్య యాత్రలు, ఆహార యాత్రలు, ప్రకృతి యాత్రలు... తాజాగా ఈ కోవలోకి వచ్చి చేరింది ‘గ్లోకేషన్‌’. అంటే... ఇటు వెకేషన్‌ ను అటు చర్మ సంరక్షణనూ కలిపే టూర్లన్నమాట. ఇదో సరికొత్త ట్రావెల్‌ కాన్సెప్ట్‌. పర్యాటక ప్రదేశాలను చూడడం, చక్కని ఆహారంతో పాటు... స్పా ట్రీట్‌మెంట్స్‌, చర్మ సంరక్షణ, సౌందర్యాన్ని మెరుగుపరచుకొనేందుకు చేసే యాత్రలివి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్‌ 27) సందర్భంగా... ఈ నయా విహారాల విశేషాలపై ఓ లుక్కేద్దాం.

వివిధ ప్రదేశాలకు టూరిస్టుల్లా వెళ్లినవారు... అలసిపోయిన ముఖాలతో, టానింగ్‌ చర్మంతో ఇళ్లకు తిరిగి వస్తుంటారు. కానీ నేడు కొత్త కాంతులతో, తేజోమయమైన చర్మంతో ఆనందంగా తిరిగి వస్తోన్న టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. ఇదంతా ‘గ్లోకేషన్‌’ మహిమ. వెకేషన్‌కు వెళ్లినవారు గ్లోతో తిరిగి రావడమే ఈ తరహా పర్యాటకం ముఖ్యాంశం. సాధారణంగా స్కిన్‌ బూస్టర్లు, ఫేషియల్‌ లాంటివి ఇంటి పక్కనే చేసుకోవచ్చు.


book3.3.jpgవాటి కోసం ఎక్కడెక్కడికో ఎందుకూ అనే సందేహం రావచ్చు. అయితే ఇలాంటి స్కిన్‌ వెల్‌నెస్‌ ట్రీట్‌మెంట్లకు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. ప్రముఖ ట్రావెల్‌ సెర్చ్‌ఇంజిన్‌ ’స్కైస్కానర్‌‘ ట్రావెల్‌ ట్రెండ్స్‌ 2026 ప్రకారం జెన్‌జీ ట్రావెలర్స్‌లో 27 శాతం మంది చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనడమే కాదు, చర్మ చికిత్సలకు సంబంధించిన యాత్రలు చేస్తున్నారట. ‘గ్లోకేషన్‌’ యాత్రలకు ప్రసిద్ధిచెందిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.


కొరియా చర్మసౌందర్యం...

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ గత రెండు దశాబ్దాలుగా చర్మ సంరక్షణ రంగంలో విస్తృత ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. అందుకే నేడు ప్రపంచ డెర్మటాలజీ (చర్మ అధ్యయనశాస్త్రం) రాజధానిగా పేరు తెచ్చుకుంది. అద్దంలా మెరిసే చర్మం కొరియన్ల సొంతం. సియోల్‌లోని ‘ఆప్గుజాంగ్‌ రోడియో’ వీధిలో ఎక్కడ చూసినా స్కిన్‌కేర్‌ క్లినిక్‌లే కనిపిస్తాయి. స్కిన్‌ బూస్టర్లు, లేజర్‌ టోనింగ్‌ వంటి అధునాతనమైన చికిత్సలు అక్కడ కనిపిస్తాయి. అమెరికాలో లక్షల రూపాయలయ్యే ట్రీట్‌మెంట్లు ఇక్కడ వేల రూపాయల్లోనే పూర్తి అవుతాయట. అందుకే అమెరికన్లు, యూరోపియన్లు గ్లోకేషన్‌ కోసం కొరియాకు క్యూ కడుతున్నారట. అక్కడి మియాంగ్‌డంగ్‌ ప్రాంతం కె- బ్యూటీ స్టోర్లకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశానికి వెళ్లే విదేశీ టూరిస్టులు అక్కడి షాపుల్లో కె సౌందర్య సాధనాలను కొనుగోలు చేసి, బ్యాగుల్లో ఇంటికి తెచ్చుకుంటుంటారు.


book3.2.jpgకొత్తపాతల కలయిక...

ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ ఫ్యాషన్లకు మాత్రమే కాదు, స్కిన్‌కేర్‌కు సంబంధించి కూడా ప్రసిద్ధి. ఫ్రాన్సువాసులు అనాదిగా చర్మసంరక్షణ కోసం ప్రత్యేక పద్ధతులను పాటించేవారు. కాలక్రమంలో వాటికి సంబంధించిన ఉత్పత్తులకు ఆధునిక శాస్త్రగతులను మేళవించి ప్రత్యేక ఔషధాలను తయారుచేసే కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిచెందాయి. ఆకుపచ్చ ప్లస్‌ బోర్డులున్న ప్రతీ ఫార్మసీ షాపుల్లో ఈ స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ఏదో ఒకటి అమ్మాలని కాకుండా... కొనుగోలుదారుల వయసు, చర్మతత్వం, అలర్జీలు... తదితరాలను తెలుసుకుని సౌందర్య నిపుణులు తగిన ఉత్పత్తులనే విక్రయించడం విశేషం. ఒకవేళ వాటిని దిగుమతి చేసుకుంటే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ప్యారిస్‌లోని షాపుల్లో చాలా చౌకగా లభిస్తాయి. అందుకే ప్యారిస్‌ యాత్రలకు వెళ్లే వాళ్లు పనిలో పనిగా చర్మ సంరక్షణ చికిత్సలు, షాపింగ్‌ పూర్తి చేసుకుంటారు. అందుకే గ్లోకేషన్‌కు ప్యారిస్‌ కేరాఫ్‌గా మారింది.


ఏమి హాయిలే హలా...

ప్రస్తుతం సౌనాలు, మడ్‌బాత్‌లు అంతటా వచ్చేశాయి. అయితే ఆఫ్రికా దేశమైన మొరాకో ‘హమామ్‌’ అనే సామూహిక స్నాన ఆచారాలకు ప్రసిద్ధి. ఇందులో ఓ పద్ధతి ప్రకారం స్నానాలు చేస్తారు. ముందుగా ఆవిరి స్నానం, ఆ తరవాత చర్మానికి మట్టిని రుద్దుకోవడం, గోరువెచ్చని నీళ్లలో మునిగి శుభ్రం చేసుకోవడం, చక్కని పరిమళ భరితమైన ఈ విటమిన్‌ ఉన్న నూనెతో మర్దన చేసుకోవడం లాంటి పద్ధతులు ఇందులో ఉన్నాయి. ఒక్కో సెషన్‌కి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. స్నేహితులతో కలిసి రిలాక్స్‌ అయ్యేందుకు హమామ్‌లను చక్కని సందర్భంగా మొరాకన్లు భావిస్తారు. అక్కడి మారకేష్‌ నగరంలోని మదీనా క్వార్టర్‌ అతి పెద్ద పబ్లిక్‌ హమామ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రైవేట్‌ హమామ్‌లూ లేకపోలేదు. పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా కూడా ఏర్పాటుచేశారు. శరీరంతో పాటు మనసుకు సాంత్వన చేకూరుస్తాయని ఈ స్నానాలకి పేరు. వందల ఏళ్ల నాటి చరిత్ర గల హమామ్‌ల కోసమే ఆ దేశానికి టూరిస్టులు వెళతారంటే అతిశయోక్తి కాదు.


book3.4.jpgఇట్టే మర్చిపోతాం

జర్మనీలోని బాడన్‌ బాడెన్‌ నగరంలో ఉన్న ‘ఫ్రీడ్‌రిక్స్‌ బాట్‌’లో స్నానం చేస్తే పది నిమిషాల్లో కాలాన్ని, ఇరవై నిమిషాల్లో ఈ ప్రపంచాన్నే మర్చిపోతాం అని అమెరికన్‌ రచయిత మార్క్‌ట్వైన్‌ అన్న మాటలు అక్షర సత్యాలని అక్కడికి వెళ్లేవాళ్లు చెపుతుంటారు. ‘గ్రేట్‌ స్పా టౌన్స్‌ ఆఫ్‌ యూరోప్‌’గా యునెస్కో గుర్తించిన నగరం ఇది. ఇక్కడ 12 సహజసిద్ధమైన ఉష్ణగుండాలు ఉండడం విశేషం. అయితే ఫ్రీడ్‌రిక్స్‌ బాట్‌ మాత్రం చారిత్రక స్నాన సముదాయం. ఈ భవనాన్ని క్రీ.శ.1877లో నిర్మించారు. ఆనాడు నగర ప్రముఖులు, నాయకులు, ధనిక కుటుంబాలకు చెందినవారు ఇక్కడ స్నానం చేసేవారు. వేడి ఆవిర్లు, సబ్బులు, బ్రష్‌లు, థర్మల్‌ పూల్స్‌... ఇలా 17 పద్ధతుల్లో మూడు గంటలపాటు సాగే ఈ స్నానాన్ని ఆచరిస్తే వాస్తవంగానే ప్రపంచాన్నే మరచిపోయేంత రిష్రెష్‌ అవుతామని అంటుంటారు పర్యాటకులు.


ఓ శాస్త్రం

ఉరుకుల పరుగుల జీవనంలో రెండు చెంబుల నీళ్లు పోసుకుని స్నానం కానిచ్చేవాళ్లే అంతా. అందుకే మనసులో ఎక్కడాలేని అలజడులు, ఆందోళనలు. స్నానాన్ని కూడా ఓ శాస్త్రంలా ఆచరించే పద్ధతి జపాన్‌లోని క్యూషు ద్వీపంలో ఉన్న బెప్పు నగరంలో కనిపిస్తుంది. ఈ నగరాన్ని ఎనిమిది ఉష్ణగుండాల జిల్లాలుగా విభజించారు. ఒక గుండం నీళ్లలో సల్ఫర్‌, మరో గుండం నీళ్లలో ఇనుము... ఇలా ఒక్కో గుండంలో ఒక్కో రకమైన ఖనిజాల నీళ్లతో ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కాసేపు ఏ గుండంలో కూర్చున్నా చర్మ తీరు మెరుగుపడుతుంది. కొంతమంది రెండు మూడు గుండాల నీళ్లలో గడుపుతూ ఒకే రోజు భిన్న ప్రాంతాల్లో విహరించిన అనుభూతిని పొందుతారు. కొన్ని సార్లు ఆ వేడినీళ్ల ప్రవాహాల దగ్గర సాయంత్రాలు గడుపుతూ సేదతీరుతుంటారు. ఇక్కడ ఆధునిక స్పాలు కూడా లేకపోలేదు. జపాన్‌ను కేవలం పర్యాటక ప్రాంతంగా కాకుండా, చర్మసౌందర్య కేంద్రంగా కూడా చూస్తున్నారు.


book3.5.jpgనీలాల నీటి మ్యాజిక్‌

అతి చల్లని దేశం ఐస్‌లాండ్‌లో ‘బ్లూ లాగూన్‌’ అంటే గొప్పగా చెప్పేవాళ్లే అంతా. దానిపై సోషల్‌ మీడియాలో ఎన్నో స్టోరీలు, రీల్స్‌. అయితే ఇది సహజసిద్ధమైన ఉష్ణగుండం కాదు. స్వార్ట్సెంగి జియోథర్మల్‌ పరిశ్రమ వ్యర్థ జలాలు ఓ చోట చేరి బ్లూ లాగూన్‌ని సృష్టించాయి. స్థానికులు వీటిని మురికినీళ్లుగా చాలా ఏళ్లు భావించారు. అయితే సిలికా, బ్లూ గ్రీన్‌ ఆల్గేల మిళితమైన ఈ జలాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఇవి ఎంతో దోహదపడతాయని వాళ్లకు తెలియడంతో ఇక బ్లూ లాగూన్‌కి టూరిస్టుల సందడి ఎక్కువైంది. అయితే పక్కనే డెర్మటాలజీ క్లినిక్‌ను ఏర్పాటుచేయడం వల్ల సోరియాసిస్‌, ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులకు ఈ నీళ్ల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. అక్కడే ఉన్న ‘స్కై లాగూన్‌ స్పా’ అనే ప్రయివేట్‌ సంస్థ ఏడు రకాల పద్ధతుల్లో ప్రత్యేక స్నాన సర్వీసులనూ అందిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏఐ దారి తప్పితే100 కోట్ల మరణాలు

టికెట్లు 2.69 లక్షలు.. యూజర్లు 6 లక్షలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 08:46 AM