టికెట్లు 2.69 లక్షలు.. యూజర్లు 6 లక్షలు!
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:16 AM
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శనివారం ఓ ప్రకటనలో ఖండించింది. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని కోరింది.
కోటాతో పోలిస్తే 9 రెట్లు అధిక డిమాండ్
అందుకే శ్రీవారి రూ.300 టికెట్లకు ఇబ్బంది
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకే ‘వర్చువల్ క్యూ’
బుకింగ్ విషయంలో ఆధునిక సాంకేతికత
సోషల్ మీడియా పోస్టులు నమ్మొద్దు: టీటీడీ
తిరుమల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శనివారం ఓ ప్రకటనలో ఖండించింది. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని కోరింది. రూ.300 టికెట్ల కోటాకు 9 రెట్లు అధికంగా డిమాండ్ ఉంటోందని.. దీంతో టికెట్ల బుకింగ్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించింది. ‘‘రూ.300 ప్రత్యేక దర్శనం కోటా ప్రకారం.. టికెట్లు సుమారు 2.69 లక్షలు. అయితే, దాదాపు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే అయిపోతాయి. ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు అధిక భారం పడకుండా మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు ‘వర్చువల్ క్యూ’ ఉపయోగిస్తున్నాం. ‘వర్చువల్ క్యూ’ అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే సాంకేతిక విధానం. టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవ స్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించడం సరికాదు. భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ అవసరమైన చర్యలు చేపడుతోంది.’’ అని ప్రకటనలో వివరించారు.
అధిక డిమాండ్ ఉన్నా..
టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలకు భక్తుల నుంచి ఒక్కసారిగా వచ్చే అధిక డిమాండ్‌ను నిర్వహించేలా గూగుల్ క్లౌడ్, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటోస్కేలింగ్, డిస్ర్టిబ్యూట్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజంటల్ స్కేలింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామని టీటీడీ తెలిపింది. టీటీడీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రకటనలో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు