ఏఐ దారి తప్పితే100 కోట్ల మరణాలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:39 AM
అదుపులేని కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు వాటిల్లనుందన్న హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐని ప్రభుత్వాలు నియంత్రించాలి: బిల్‌గేట్స్
వచ్చే ఐదేళ్లలో సూపర్ ఏఐ యంత్రాలు..
వాటిపై మనుషులకు నియంత్రణ ఉండదు
అలన్ ట్యూరింగ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక
వాషింగ్టన్, సెప్టెంబరు 26: అదుపులేని కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు వాటిల్లనుందన్న హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దుష్ట ఆలోచనలు ఉన్న వ్యక్తుల చేతుల్లో అత్యాధునిక ఏఐ టూల్స్ ఉంటే.. అది వినాశనానికి దారి తీస్తుందని, ఏకంగా 100 కోట్ల మంది మరణించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఎన్‌బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ అవధుల్లేనంతటి శక్తిమంతం కాకుండా దాని మీద ప్రభుత్వాలు నియంత్రణలు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ రంగంలో అభివృద్ధిపై బ్రిటన్‌కు చెందిన అలన్ ట్యూరింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. రానున్న ఐదేళ్లలో సూపర్ ఇంటలిజెన్స్ ఏఐ యంత్రాలు ఉనికిలోకి వస్తాయని ఆ నివేదిక హెచ్చరించింది.