హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనకు భారీ స్పందన
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:38 AM
హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 3.0 ఘనంగా జరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం నిర్వహించిన ఈ రన్‌లో 35 వేల మందికిపైగా పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: నగరంలోని నెక్లెస్ రోడ్డులో పింక్ పవర్ రన్ 3.0 ఉత్సాహంగా నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ రన్‌కు 35 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 3, 5, 10, 21 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన పరుగులు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమై నెక్లెస్ రోడ్ వరకు సాగాయి. ఆరోగ్యం, అవగాహన, మహిళా సాధికారత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పింక్ పవర్ రన్‌కు మంత్రి సీతక్క, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, బాక్సర్ విజేందర్ సింగ్, సంగీత దర్శకుడు ఎస్.థమన్, నటుడు సిద్దు జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు. ఎస్.థమన్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శనతో కార్యక్రమంలో మరింత సందడి నెలకొంది. 2024లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో తొలి ఎడిషన్ నిర్వహించగా.. 2025లో నెక్లెస్ రోడ్డులో రెండో ఎడిషన్ జరిగింది. ప్రతి ఏడాది పింక్ పవర్ రన్‌కు ఆదరణ పెరుగుతుండటంతో మూడో ఎడిషన్‌లోనూ భారీగా ప్రజలు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం వంటి సందేశాలను ఈ రన్ ద్వారా నిర్వాహకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి:
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్ కూల్‌గా.!
పెన్సిల్ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!