తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:10 AM
న్యూదిల్లీలో ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించారు.
న్యూదిల్లీలో ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని బహూకరించారు. భారతదేశపు గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే ఈ ప్రాచీన గ్రంథ విశిష్టత, ప్రాముఖ్యం మరోసారి చర్చల్లోకి వచ్చాయి! ఇంతకీ తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?
కుల, మతాలకు అతీతంగా నిలిచి, మానవాళికి శాశ్వతమైన నైతిక, సామాజిక, రాజకీయ విజ్ఞానాన్ని అందించింది ‘తిరుక్కురళ్’. నీతి, పరిపాలన, సమాజం, మానవ విలువలను ప్రబోధించే 1330 పద్యాలు (కురళ్స్) ఉన్న ఈ గ్రంథాన్ని కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించారు. 1500 నుంచి 2,300 ఏళ్ల క్రితం ఈ రచన జరిగిందని భావిస్తారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో, తత్వశాస్త్రంలో ఇది అత్యంత ముఖ్య రచనగా పరిగణన పొందింది. ఒక్కో అధ్యాయంలో 10 పవిత్ర ద్విపదల (కప్లెట్స్) చొప్పున మొత్తం 133 అధ్యాయాలున్నాయి. ప్రతీ ద్విపదా ‘కురళ్’ అనే ఏడు పదాలతో ఉంటుంది. ప్రతీ కురళ్ రెండు పంక్తుల్లో ఒక సంపూర్ణ జీవన సూత్రాన్ని చెబుతుంది. తిరుక్కురళ్ ప్రత్యేకత... దాని సంక్షిప్తత. రెండు పంక్తుల్లో చెప్పిన భావం... గంటల తరబడి చర్చించగలిగేంత లోతు ఉంటుంది.
మూడు భాగాలుగా...
నైతికతపై గొప్ప ప్రభావం చూపే ఈ రచనలో మూడు భాగాలుంటాయి.
1. ధర్మం (అరం): వ్యక్తిగత విలువల గురించి వివరించే బుక్ ఆఫ్ వర్చ్యూస్. ఇందులో మొత్తం 38 అధ్యాయాలు. కడవుల్ వాళ్తు (దైవ స్తుతి) అనే మొదటి అధ్యాయంలో వివరించిన దైవ భావన ప్రత్యేకమైనది. ఆయన దృష్టిలో దేవుడు స్వచ్ఛమైన చైతన్యం. జ్ఞానం, కరుణ, నైతికత, ప్రేమలకు మూర్తి రూపం.
2. సంపద (పొరుల్): దీంతో పాటు సామాజిక, ఆర్థిక విలువల బోధనలతో కూడిన బుక్ ఆఫ్ పాలిటీ. ఇందులో మొత్తం 70 అధ్యాయాలు... పరిపాలన, రాజనీతి, సామాజిక జీవితాలపై వెలుగు ప్రసరిస్తాయి.
3. ప్రేమ (ఇన్బం): బుక్ ఆఫ్ లవ్‌గా అభివర్ణించే ఈ భాగంలో 25 అధ్యాయా లున్నాయి. కలవియల్ , కర్పీయల్ అనే రెండు రూపాలుగా ఉంటుంది ప్రేమ.
కల వియల్ అనేది వివాహానికి పూర్వపు ప్రేమను సూచిస్తుంది. ఇది ఎలాంటి ఆచారాలూ లేకుండా వివాహంతో ముగుస్తుంది. కర్పీయల్ అనేది సంప్రదాయ వైవాహిక ప్రేమను సూచిస్తుంది. ప్రేమలోని భిన్న కోణాలను అన్వేషించడానికి తిరువళ్లువర్ కవితాత్మక భావనలనూ, వివిధ నాటకీయ, భావయుక్త సన్నివేశాలనూ ఉపయోగించారు. ఆయన పద్యాలు ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా ప్రశాంతమైన ఆనందానికి మూలంగా చిత్రీకరిస్తాయి.
పాలకుడి లక్షణాలు, న్యాయపాలన, సలహాదారుల ఎంపిక, నిర్ణయం తీసుకోవడం, ప్రజా సంక్షేమం లాంటి అంశాలపై కురళ్‌లు ఉన్నాయి. అదే సమయంలో సాధారణ వ్యక్తి మాట, కోపం, స్నేహం, విద్య, సంపాదన, కుటుంబజీవితం గురించి కూడా చెబుతాయి.
అనువాదాల జోరు
తిరుక్కురళ్‌ను 18వ శతాబ్దిలో ఆంగ్లభాషలోకి అనువదించారు. తర్వాత 60కి పైగా వివిధ భాషల్లోకి తర్జుమా అయింది. 19వ శతాబ్దిలో దీన్ని ఫ్రెంచి భాషలోకి అనువదించిన ఇ.ఎస్. ఏరియల్ తిరుక్కురళ్‌ను ‘పేరు లేని రచయిత రాసిన పేరులేని పుస్తకం’గా వర్ణించారు. ఈ గ్రంథాన్ని గురించి క్రమబద్ధంగా అధ్యయనం చేసిన తొలి పండితుల్లో జార్జ్ ఉగ్లో పోప్ (1820- 1908) ఒకరు. ఈయన ఆంగ్లికన్ క్రైస్తవ మిషనరీ, తమిళ పండితుడూ. తిరువళ్లువర్‌ను ‘విశ్వ మానవ కవి’గా అభివర్ణించారు. పుతిన్‌కు బహుమతిగా ఇచ్చిన రష్యన్ అనువాదాన్ని నైరా మ్కృత్చ్యాన్ అనువదించారు. ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసి కల్ తమిళ్’ వారి తిరుక్కురళ్ అనువాదశ్రేణిలో భాగంగా ఈ ఏడాదే దీన్ని ప్రచురించారు.
ఆధునిక కాలానికీ వర్తిస్తుందా?
రెండు వేల ఏళ్ల క్రితం రచించినదైనప్పటికీ ఆధునిక కాలానికి కూడా తిరుక్కురళ్ ప్రాముఖ్యం, ప్రాసంగికత కనిపిస్తాయి. ఈ గ్రంథం నైతిక ప్రవర్తన అవసరాన్నీ, మానవ జీవిత వాస్తవికతనూ వివరిస్తుంది. మతం, కులం, జాతి ఆధారిత విభజనలను తిరువళ్లువర్ వ్యతిరేకించారు. అర్థవంతమైన మానవ జీవితానికి నైతికత, దయ ఇంకా ప్రేమ, దాతృత్వం లాంటి సద్గుణాలు అత్యవ సరమని ప్రబోధించారు. అసూయ, దురాశ, కోపం, కాఠిన్యం లాంటి భావనలకు లోనవడం వల్ల నైతికత నశిస్తుందనీ, ఆ జీవితం దుఃఖానికి దారితీస్తుందనీ హెచ్చరించారు.
చదువు ప్రాముఖ్యంపై తిరువళ్లువర్ వేల ఏళ్ల క్రితం చేసిన ఆలోచనలు ఆయన దార్శనికతను వెల్లడిస్తాయి. విద్యపై ఆయన భావాలకూ, ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో ఆలోచనలకూ మధ్య కొందరు పోలికలను గుర్తిస్తారు. ఈ తమిళ తత్వవేత్త దృష్టిలో సద్గుణం, జ్ఞానం, విద్య విడదీయలేనివి. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న పోస్టు పెద్ద వివాదానికి దారితీయవచ్చు. మాటను ఆలోచించి ఉపయోగించడం, ఇతరులను బాధించే మాటలకు దూరంగా ఉండటం లాంటి అంశాలపై తిరుక్కురళ్‌లోని సూచనలు అనుసరణీయమే!
ఈ వార్తలు కూడా చదవండి:
ఏఐ దారి తప్పితే100 కోట్ల మరణాలు
పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...
Read Latest AP News And Telangana News And International News And Telugu News