ఫార్మసీ చట్టాల అమలుతోనే ప్రజారోగ్యం
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:20 AM
భారత దేశంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మసీ చట్టం 1948, డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940ను రూపొందించింది.
నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం
వరంగల్: భారత దేశంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మసీ చట్టం 1948, డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం 1940ను రూపొందించింది. యేటా ప్రపంచ వ్యాప్తంగా ఫార్మసిస్టుల దినోత్సవాన్ని సెప్టెంబర్ 25న జరుపుకుంటారు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం. ఫార్మసీ చట్టం 1948 సెక్షన్ (42) ప్రకారం మందుల షాపుల్లో అర్హులైన రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల స్వీయ పర్యవేక్షణలో ఫార్మసిస్టులు మాత్రమే మందులను విక్రయించాలి.
అర్హతలు లేని వారు మందులు విక్రయిస్తే మెడికల్ షాపు లైసెన్సు సస్పెన్షన్ లేదా రద్దు చేస్తూ జైలుశిక్షతో పాటు నగదు జరిమానా విధించే అవకాశం ఉంది. నూతన ఔషధాల పరిశోధనలు, మందుల తయారీ, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ, పరిరక్షణ, నిర్ధిష్టమైన ఉష్ణోగ్రతల్లో మందులను నిల్వ చేసి రోగులతో మందుల వినియోగం పట్ల కౌన్సెలింగ్‌లో ఫార్మసిస్టులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 89,671 మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఉండగా అందులో 82522 మంది డీఫార్మసీ, బీఫార్మసీ, మరో 7149 మంది ఫార్మ్‌డీ (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) అర్హతలతో రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. మెడికల్ కళాశాలల్లో క్లినికల్ ఫార్మసీ, ఫార్మాకో విజిలెన్స్ విభాగాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి నిరుద్యోగ ఫార్మాడీతో పాటు ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
కాగా, ఫార్మసిస్టులు లేకుండా మందులను విక్రయించే షాపుల్లో ఫార్మసీ కౌన్సిల్, ఔషధ నియంత్రణ శాఖ కఠినంగా వ్యవహరించాలని, తద్వారా ఔషధ వినియోగదారులు చట్టబద్ధమైన సేవలను పొందవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మసిస్ట్ లేకుండా నడిచే మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని, ఔషధ నియంత్రణ శాఖ యంత్రాంగం కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఫార్మసీ చట్టం, డ్రగ్స్ కాస్మోటిక్స్ చట్టాలను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తే ఫార్మసీ వృత్తి గౌరవం, ప్రాధాన్యత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రతీ ఔషధ వినియోగదారుడు మందులు కొనే ముందు ఆయా షాపుల్లో డ్రగ్ లైసెన్సు ఉందా?, ఫార్మాసిస్టు ద్వారానే మందులను కొంటున్నారా? చూసుకోవాలని వారు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌ఎచ్‌పీ) పోస్టుల భర్తీల్లో బీఫార్మసీ, ఫార్మాడీ అర్హతలు కలిగి ఉన్న వారిని కూడా అర్హులుగా పరిగణించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
పోస్టులు భర్తీ చేయాలి
ప్రతీ పీహెచ్‌సీలో అదనపు ఫార్మసిస్టుల పోస్టులు మంజూరు చేయాలి. బస్తీ దవాఖానాల్లో, యూపీహెచ్‌సీలలో రెగ్యూలర్ ఫార్మసిస్టు పోస్టు లు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 732 ఫార్మసిస్టుల పోస్టుల భర్తీలో నెలకొన్న వివాదాన్ని సత్వరమే పరిష్కరించి, ఫలితాలు ప్రకటించారు.
ఉప్పు భాస్కర్ రావు
ఈ వార్తలు కూడా చదవండి:
బ్యాంకు సేవలకు 5 రోజుల బ్రేక్
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే
Read Latest AP News And Telangana News And International News And Telugu News