Share News

ఈ టీచర్‌...పట్టుదలకు మారుపేరు!

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:22 AM

కాళ్లతో అక్షరాలు దిద్దడం నేర్చుకున్నాడు... ఇప్పుడు అవే కాళ్లతో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు! ఆయనకు చేతుల్లేవు... కాళ్లే చేతులయ్యాయి.

ఈ టీచర్‌...పట్టుదలకు మారుపేరు!
PHC, School Teacher

కాళ్లతో అక్షరాలు దిద్దడం నేర్చుకున్నాడు... ఇప్పుడు అవే కాళ్లతో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు! ఆయనకు చేతుల్లేవు... కాళ్లే చేతులయ్యాయి. చిన్నప్పుడు నేలపై కూర్చొని, కాళ్ల వేళ్ల మధ్య సుద్దముక్కను పట్టుకుని అక్షరాలు దిద్దిన ఆ బాలుడు... ఈరోజు అదే కాళ్లతో తరగతి గదిలో పాఠాలు బోధించే మాస్టారుగా ఎదిగారు. ఆయనే జామి సింహాచలం నాయుడు. కృషి, పట్టుదలతో ఎదిగిన ఆయన విజయగాథ ఇది...

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిసెట్టిపాలెం గ్రామానికి చెందిన సింహాచలం నాయుడు... రెండు చేతులు, ఎడమ కాలికి వైకల్యంతో జన్మించాడు. బిడ్డను చూసిన తల్లిదండ్రులు సన్యాసిరావు, సన్యాసమ్మలకు ఒక్కటే ఆందోళన... ‘బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో? ’నని. కానీ ఆ వేదనకు సమాధానం అప్పుడే వారు ఊహించలేదు. ఎందుకంటే... ఆ బిడ్డ తన భవిష్యత్తును తానే రాసుకోబోతున్నాడని వారికి అప్పటికి తెలియదు.


బాబాయి ప్రోత్సాహంతో...

సింహాచలానికి మూడు, మూడున్నరేళ్ల వయసు. ఇతర పిల్లలు చిట్టి చేతులతో బొమ్మలు పట్టుకొని ఆడుకుంటుంటే... అతని చేతులకు మాత్రం ఆ అవకాశం లేదు. అతని బాబాయి జామి నరసింగరావు తెలుగు టీచర్‌. ఒక సుద్దముక్కను సింహాచలం కాళ్ల వేళ్ల మధ్య పెట్టారు. మొదట గచ్చు మీద గీతలు. తర్వాత గుండ్రటి సున్నాలు. గోడల మీద, తలుపుల మీద... అలా కాళ్లతో గీతలు గీస్తూ గీస్తూ ఆ చిన్నారి అక్షరాలను నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసుకే సింహాచలానికి కాళ్లతో తెలుగు అక్షరాలన్నీ రాయడం వచ్చేసింది.


book6.jpgఅలా, అతని జీవితంలో ‘‘నేను చేయగలను’’ అనే తొలి అక్షరబీజం అప్పుడే పడింది. ఐదో ఏటే గనిసెట్టిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొదటి తరగతిలో చేరాడు. తరగతి గదిలో మిగతా పిల్లలంతా బెంచీలపై కూర్చొని పుస్తకాలు తెరిచేవారు. సింహాచలం మాత్రం నేలపై కూర్చునేవాడు. అతని చేతిలో పెన్ను ఉండేది కాదు. కాళ్ల వేళ్ల మధ్యే పెన్ను ఉండేది. చూస్తున్నవారికి అది అసాధారణ దృశ్యం కావచ్చు. కానీ సింహాచలానికి అది సాధారణ జీవితం. అతను ఐదో తరగతి వరకు తన గ్రామంలోనే చదువుకున్నాడు.


ఆ తర్వాత అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం, అమీన్‌ సాహెబ్‌పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ‘‘అక్కడ మా బాబాయి నరసింగరావే ఉపాధ్యాయుడిగా పని చేస్తుండటంతో, ప్రతిరోజూ ఆయనతో కలిసి పాఠశాలకు వెళ్లేవాడిని. బాబాయి చూపించిన దారి, తల్లిదండ్రుల అండ, స్నేహితుల సహకారం, గురువుల ప్రోత్సాహం... ఇవన్నీ కలిసి చదువు పట్ల అంతులేని నమ్మకాన్ని కలిగించాయి’’ అంటాడు సింహాచలం.


స్క్రైబ్‌ను వద్దన్నాడు...

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు. అధికారులు సింహాచలానికి స్ర్కైబ్‌ (అంటే అతని తరఫున పరీక్ష రాసే వ్యక్తి ) సహాయం అందిస్తామని చెప్పారు. ‘కానీ ఆ సహాయాన్ని తీసుకోకుండా కాళ్లతోనే పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను. పరీక్ష హాల్లో కూర్చొని కాళ్ల వేళ్ల మధ్య పెన్ను పట్టుకొని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశాను. పరీక్షను నిర్ణీత సమయంలోనే పూర్తిచేశాను. ఫలితాలు వచ్చాయి. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యాను’ అని సంతోషంగా చెప్పాడు.


book6.2.jpgఅది సింహాచలం తొలి విజయం మాత్రమే కాదు. తనపై ఇతరులకున్న అనుమానాలకు ఇచ్చిన తొలి సమాధానం. ఇక అక్కడితో ఆగలేదు... చదువు కొనసాగించాడు. కొత్తవలస లోని కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎం.పి.సి చదివాడు. 888 మార్కులు సాధించాడు. ఆ తర్వాత డి.ఎడ్‌లో 82శాతం. దూరవిద్య ద్వారా డిగ్రీలో 63 శాతం. తర్వాత బి.ఎడ్‌లో 75 శాతం. ఇవన్నీ... స్ర్కైబ్‌ సహాయం లేకుండా, తన కాళ్లతోనే స్వయంగా రాసిన పరీక్షల్లో సాధించిన ఫలితాలు. ప్రతీరోజూ కళాశాలకు తన తండ్రి సన్యాసిరావు బైక్‌పై తీసుకెళ్లేవారు.


ఓపెన్‌ కేటగిరీలోనే...

చిన్నప్పటి నుంచే సింహాచలానికి ఒక కల ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని. 2019లో ఈ.్ఛజూ.్ఛఛీ పూర్తయిన తర్వాత డీఎస్సీ కోసం సిద్ధమవడం మొదలుపెట్టాడు. ఇంటి వద్దే యూట్యూబ్‌, స్నేహితుల సూచనలు, స్వీయ అధ్యయనంతో సన్నద్ధమయ్యాడు. డిసేబిలిటీ కోటాలో కాకుండా... ఓపెన్‌ కేటగిరీలోనే ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత 2022లో నిర్వహించిన టెట్‌లో తొలి ప్రయత్నంలోనే 150కి 120 మార్కులు సాధించాడు. విశాఖ జిల్లాలో తొలి ప్రయత్నంలోనే మెగా డీఎస్సీ 2025లో 79.28 మార్కులతో జిల్లా స్థాయిలో 320వ ర్యాంక్‌ సాధించాడు. ఓపెన్‌ కేటగిరీలో ఎస్జీటీగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. డీఎస్సీ పరీక్ష సమయంలో మాత్రం సింహాచలం స్క్రైబ్‌ సహాయం తీసుకున్నాడు.


తొలి పోస్టింగ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మాడుగుల మండలం కులుపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వచ్చింది. పాడేరు నుంచి ప్రతీరోజూ తండ్రితో కలిసి బస్సులో పాఠశాలకు వెళ్లేవాడు. అక్కడ 5,6,7 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాడు. ‘‘సింహాచలం సోషల్‌ టీచర్‌ అయినప్పటికీ అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉంది. లెక్కలు కూడా బోధించేవాడు. టీచర్‌ వృత్తిని ఒక ఉద్యోగంలా కాకుండా కమిట్‌మెంట్‌తో చేసేవాడు. ఆయన పాఠాలు చెబుతుంటే పిల్లలు చాలా శ్రద్ధగా వింటారు’’ అన్నారు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్‌ నాగరాజు. ప్రస్తుతం సింహాచలం 2026-27 విద్యా సంవత్సరంలో డెప్యూటేషన్‌పై అనంతగిరి మండలం శివలింగపురం గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు.


ఈరోజు సింహాచలం కాళ్ల మధ్య పెన్ను ఉంది. ఎదురుగా పుస్తకం ఉంది. చుట్టూ గిరిజన విద్యార్థులున్నారు. తరగతి గదిలో అతను పాఠం చెబుతున్నాడు. ఒకప్పుడు తన జీవితాన్ని ఎలా రాయాలో నేర్చుకున్న ఆ కాళ్లు... ఇప్పుడు మరో తరం పిల్లల జీవితాలకు నడకలు నేర్పుతున్నాయి.

  • శ్యాంమోహన్‌, 94405 95858


ఈ వార్తలు కూడా చదవండి:

తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?

పర్యాటకం... సౌందర్యం... జమిలిగా...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 11:23 AM