కూకట్‌పల్లిలో ఆస్తి వివాదం.. తల్లి, తమ్ముడిపై దాడి..
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:46 AM
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆస్తి వివాదం కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కన్నతల్లి, తమ్ముడిపై అన్న దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో.. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి..
హైదరాబాద్, సెప్టెంబర్ 27: నగరంలోని కూకట్‌పల్లిలో ఆస్తి వివాదం కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆల్విన్ కాలనీలో బ్యాంకు ఉద్యోగం చేస్తూ తన తల్లితో కలిసి నివసిస్తున్న నాగార్జున.. తన అన్న, వదిన, ఆమె సోదరుడి నుంచి నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపించారు. ఆస్తి వివాదం కారణంగా తనపై మాత్రమే కాకుండా పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిపైనా పలుమార్లు భౌతిక దాడులు జరిగినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆస్తి కోసం తన అన్న తనపై.. తల్లిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినట్లు తెలుస్తోంది. ఇంట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
గతంలోనూ తమపై పలుమార్లు దాడులు జరిగాయని నాగార్జున ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో తాను గాయపడినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యుల వేధింపులతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న తల్లిపై కూడా దాడులు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని నాగార్జున ఆరోపించారు. తమకు న్యాయం చేయడంతో పాటు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇరువైపుల వాదనలు మరియు పోలీసుల అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్ కూల్‌గా.!
పెన్సిల్ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!