ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:56 AM
స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు, యాప్‌లు, డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లు పేరుకుపోవడంతో స్టోరేజీ త్వరగా నిండిపోతుంది. అయితే.. ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా.. కొన్ని సులభమైన చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందవచ్చని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: నేటి ప్రపంచంలో చాలా మంది తమ జీవితాలను స్మార్ట్‌ఫోన్‌లతోనే గడుపుతున్నారు. అందులో ఫొటోలు, వీడియోలు, యాప్‌లు, డౌన్‌లోడ్ చేసిన ఫైళ్లు పేరుకుపోవడంతో స్టోరేజీ త్వరగా నిండిపోతుంది. ఆ తర్వాత 'లో స్టోరేజ్' నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఆ టైమ్‌లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏవీ తొలగించాల్సిన అవసరం లేకుండానే.. కొన్ని సులభమైన చిట్కాలతో బోలెడంత ఖాళీని పొందవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూస్తే...
1. స్మార్ట్ స్టోరేజీ
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో 'స్మార్ట్ స్టోరేజీ' సదుపాయం ఉంటుంది. దీనిని ఉపయోగించడం ద్వారా.. గూగుల్ ఫొటోస్‌లో ఇప్పటికే బ్యాకప్ అయిన ఫొటోలు, వీడియోలను ఫోన్ నుంచి తొలగిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడం వల్ల దీని ఫీచర్ యాక్సెస్ కోల్పోకుండా స్టోరేజీ ఖాళీ అవుతుంది. సాధారణంగా సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి స్టోరేజీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని తద్వారా ఫ్రీ అప్ స్పేస్‌ను సెలెక్ట్ చేసుకుంటే సరి.
2. అనవసర ఫైల్స్‌ను డిలీట్ చేయడం
సెట్టింగ్స్ మెనూలోని స్టోరేజీలో ఏ కేటగిరీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తోందో ముందుగా చూసుకోవాలి. అవసరం లేని ఫొటోలు, వీడియోలు, పాత ఫైళ్లను తొలగించడం ద్వారా బోలెడంత స్థలం ఖాళీ అవుతుంది. స్ట్రీమింగ్ యాప్‌లలో డౌన్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు వంటివి ఎక్కువ స్టోరేజీని ఆక్రమించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి.
3. వాడని యాప్‌లను తొలగించడం
ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగించే యాప్‌లు ఫోన్‌లో స్థలాన్ని ఆక్రమిస్తుంటాయి. అవసరం లేని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కొన్నిసార్లు యాప్ కాచీని క్లియర్ చేయడం ద్వారా కూడా కొంత స్థలం లభిస్తుంది. అయితే ఆ సమయంలో క్లియర్ స్టోరేజీ లేదా క్లియర్ డేటా అనే ఆప్షన్స్‌ను జాగ్రత్తగా వాడాలి. లేదంటే యాప్ డేటా మొత్తం పోయే ఛాన్స్ ఉంది.
4. యాప్‌లను ఆర్కైవ్ చేయడం
ఆండ్రాయిడ్‌లో అరుదుగా ఉపయోగించే యాప్‌లను ఆర్కైవ్ చేసే సదుపాయం ఉంటుంది. దీంతో యాప్ తొలగిపోయినా దాని ఐకాన్, పర్సనల్ డేటా సేఫ్టీగా ఉంటాయి. అవసరమైనప్పుడు మళ్లీ యాప్‌ను పొందవచ్చు. దీని కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో.. సెట్టింగ్స్ మెనూ ద్వారా జనరల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని, దాని ద్వారా ఆటోమేటికల్లీ ఆర్కైవ్ యాప్స్ అనే సబ్ ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు.
5. డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఖాళీ చేయడం
పాత పీడీఎఫ్‌లు, చిత్రాలు, వీడియోలు, ఇన్‌స్టాలేషన్ ఫైళ్లు తదితరాలు ‘డౌన్‌లోడ్స్’ ఫోల్డర్‌లో పేరుకుపోతుంటాయి. ‘ఫైల్స్’ లేదా ‘ఫైల్స్ బై గూగుల్’ యాప్‌లోకి వెళ్లి అవసరం లేని ఫైళ్లను తొలగిస్తే స్టోరేజీపై భారం తగ్గుతుంది.
ఈ చిట్కాలలో కొన్నింటిని మీరు ప్రయత్నినా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో బోలెడంత స్పేస్ వస్తుంది. కానీ ముఖ్యమైన ఫైళ్లను డిలీట్ చేసేముందు అవి బ్యాకప్ అయ్యాయో లేదో మాత్రం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
జియో, వీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. నచ్చిన నంబర్‌ను ఇలా పొందండి!
ఫోన్ టెంపర్డ్ గ్లాస్‌పై కొత్త రూల్.. ధరలు పెరుగుతాయా?