ఫోన్ టెంపర్డ్ గ్లాస్‌పై కొత్త రూల్.. ధరలు పెరుగుతాయా?
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:50 PM
స్మార్ట్‌ఫోన్ టెంపర్డ్ గ్లాస్‌పై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నాణ్యత లేని స్క్రీన్ ప్రొటెక్టర్లను నియంత్రించేందుకు BIS రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నాణ్యత లేని స్క్రీన్ ప్రొటెక్టర్లను నియంత్రించేందుకు కేంద్రం వీటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
సెప్టెంబరు 21న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. భారత్‌లో తయారు చేసే లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్క్రీన్ ప్రొటెక్టర్లు BIS నిర్దేశించిన IS 19348:2025 ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
కొత్త ప్రమాణాల్లో ఏముంది?
నాణ్యత: గాజు బలం, పరిమాణం, ఉపరితల నాణ్యతకు ప్రమాణాలు పాటించాలి.
స్పష్టత: స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
రక్షణ: యాంటీ-గ్లేర్, బ్లూ లైట్ ఫిల్టర్, ప్రైవసీ ఫిల్మ్ వంటి ఫీచర్లలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
ప్యాకేజింగ్: తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, ప్రొటెక్టర్ మందం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి.
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో లభించే స్క్రీన్ ప్రొటెక్టర్లు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ ధరల్లో బ్రాండెడ్, బ్రాండ్ లేని స్క్రీన్ గార్డులు, టెంపర్డ్ గ్లాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై తయారీదారులు, దిగుమతిదారులు తమ ఉత్పత్తులు నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
ధరలు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వం అన్ని స్క్రీన్ ప్రొటెక్టర్లకు BIS రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది. 2027 ఏప్రిల్ 1 నుంచి IS 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న స్క్రీన్ ప్రొటెక్టర్లనే భారత్‌లో విక్రయించాల్సి ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్టర్ల ధరలు పెంచాలని చెప్పలేదు. అయితే కొత్త ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు, ధ్రువీకరణ చేయాల్సి ఉండటంతో తయారీదారులు, దిగుమతిదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.
Also Read:
బొల్లారం ఆయుధాల చోరీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ