Share News

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:56 AM

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నంతో ముగియనుంని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. మరో వైపు నగరవ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముమ్మరం చేసింది.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నగరంలో వినాయక నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నంతో ముగియనుంని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. మరో వైపు నగరవ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముమ్మరం చేసింది. నిమజ్జన ఊరేగింపు జరిగిన మార్గాలలో వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసింది. విగ్రహాల నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సిబ్బంది సేకరించారు.


అదే సమయంలో మూడు కార్పొరేషన్ల పరిధిలో 13 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించారు. ఈ మొత్తాన్ని జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డ్‌కి తరలిస్తున్నారు. అయితే పేపర్ షాట్స్ ద్వారా వచ్చిన చెత్తను తొలగించడంలో శానిటేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ శానిటేషన్ పనుల కోసం 15 వేల మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ వినియోగించింది. ఈ రోజు సాయంత్రం వరకు శానిటేషన్ పూర్తిచేసేలా బల్దియా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.


గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే వరకూ 3 లక్షల 10 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. అందులో 66 వేల విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేసినట్లు తెలిపారు. అయితే గతేడాదితో పోలిస్తే 10 శాతం విగ్రహాలు ఈ ఏడాది పెరిగాయని చెప్పారు. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో నిమజ్జన చేసిన విగ్రహాల డెబ్రిస్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.

Updated Date - Sep 27 , 2026 | 11:00 AM