Share News

యజమానిని కోటీశ్వరుడిని చేసిన పాత ట్రాక్టర్.. ఒకే ఒక్క వీడియోతో చివరకు..

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:12 PM

ఇంట్లో పాత, మూలనపడిన వస్తువుంటే ఏం చేస్తాం.. వెంటనే పాత, ఇనుప సామాన్లకు వేసేస్తాం. మరీ పనికిరాకపోతే.. చెత్తకుప్పల్లో పడేస్తాం. కానీ మూలనపడిన ఓ ట్రాక్టర్ ఇంజిన్.. ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. ఆ ఇంజిన్‌ను వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

యజమానిని కోటీశ్వరుడిని చేసిన పాత ట్రాక్టర్.. ఒకే ఒక్క వీడియోతో చివరకు..

ఇంట్లో పాత, మూలనపడిన వస్తువుంటే ఏం చేస్తాం.. వెంటనే పాత, ఇనుప సామాన్లకు వేసేస్తాం. మరీ పనికిరాకపోతే.. చెత్తకుప్పల్లో పడేస్తాం. కానీ మూలనపడిన ఓ ట్రాక్టర్ ఇంజిన్.. యజమానికి కోటీశ్వరుడిని చేసింది. ఆ ఇంజిన్‌ను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. చివరకు ఆ వీడియోను ఓ విదేశీయుడుడు చూడటంతో ట్రాక్టర్ యజమాని దశ తిరిగిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో(Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) జలంధర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పాత ఇంజిన్‌ను(Old tractor engine) కొన్నేళ్లుగా మూలనపడి ఉంది. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీయడంతో పురాతన వస్తువులు సేకరించే ఓ విదేశీయుడి కంటపడింది. వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని షహీద్ భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలోని పాత భవనంలో ఈ ట్రాక్టర్ ఇంజిన్ ఏళ్ల తరబడి మూలనపడి ఉంది. ఇది పనికిరాని వస్తువని అంతా దీన్ని పట్టించుకోవడమే మానేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌కు చెందిన వ్యక్తి.. ఈ ట్రాక్టర్‌ను పంజాబ్‌‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రాక్టర్ అసలు యజమాని సుమారు 40 సంవత్సరాల క్రితం అమెరికాలో స్థిరపడటంతో ఈ ఇంజిన్‌ ఇక్కడే మూలనపడింది. దీంతో చివరకు ఇది పిల్లల ఆట వస్తువుగా మారింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. ఈ ట్రాక్టర్ వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని రోజుల్లోనే వీడియో వైరల్ అవడంతో పాత వస్తువులను కలెక్ట్ చేసే వాళ్ల దృష్టికి వెళ్లింది.


జర్మనీలోని మాన్‌హీమ్‌లో హెన్రిచ్ లాంజ్ కంపెనీ.. 1921లో ఈ ట్రాక్టర్ ఇంజిన్‌ను తయారు చేసినట్లు తెలిసింది. ఈ ఇంజిన్ ప్రపంచంలోని అరుదైన వ్యవసాయ వారసత్వ సంపదలో ఒకటిగా నిలిచింది. 'లాంజ్ బుల్‌డాగ్ HL-12' మోడల్‌కు చెందిన ఈ ఇంజిన్.. 12 హార్స్‌పవర్ సింగిల్ సిలిండర్ 'హాట్ బల్బ్ ఇంజిన్'తో నడిచిందట. ఈ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ముందు వేడెక్కించాల్సి ఉంటుందట. తక్కువ వేగం, అద్భుత సామర్థ్యంతో పనిచేసిన ఈ ట్రాక్టర్‌ను.. అప్పట్లో పొలాలు దున్నడం, నీటి పంపుల ఆపరేషన్, మిల్లులు తిప్పడం వంటి అనేక పనుల్లో వాడేవారని తెలుస్తోంది. ఈ రకం ఇంజిన్లను 1921 నుంచి 1950 వరకు మాత్రమే ఉత్పత్తి చేశారట. ఆ తర్వాత ఎక్కడా ఇవి కనిపించకపోవడంతో అరుదైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. జర్మన్ వ్యవసాయ సాంకేతికత ప్రారంభ దశల్లో ఈ ట్రాక్టర్లు కీలక పాత్ర పోషించాయట.


వీడియో వైరల్ అవడంతో మొదట్లో ముంబైలోని ఓ కంపెనీ.. ఈ ఇంజిన్‌ను రూ.2 లక్షలు, తర్వాత రూ.28 లక్షలు ఆఫర్ చేసింది. కానీ ఇంజిన్‌ను ఇచ్చేందుకు.. దాని యజమాని అంగీకరించలేదు. చివరికి ఫిబ్రవరి 17న అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. దీన్ని రూ.1.25 కోట్లకు కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి 18న క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను ట్రక్కులో ఎక్కించి ముంబై ఓడరేవుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కాలిఫోర్నియాకు రవాణా చేశారు. ఈ ఇంజిన్‌ను త్వరలో కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ వ్యవసాయ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..

కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2026 | 02:25 PM