అఖిలేశ్ క్షమాపణ చెప్పాకే అయోధ్యకు రావాలి: సీఎం యోగి ఆదిత్యనాథ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:05 PM
అఖిలేశ్ యాదవ్ అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలంటే ముందుగా రామభక్తులు, సాధువులకు క్షమాపణ చెప్పాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కరసేవకులపై గతంలో జరిగిన కాల్పులను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రాములోరిని దర్శించుకోవాలనుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ముందుగా రామభక్తులు, సాధువులకు క్షమాపణ చెప్పాలని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. గతంలో రామజన్మభూమి ఉద్యమ సమయంలో కరసేవకులపై కాల్పులు జరిపించిన చరిత్రను గుర్తుచేస్తూ.. సదరు చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాకే ఆలయంలోకి ప్రవేశించాలని 'ఆజ్‌తక్ పంచాయత్' కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా.. అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఈ ఏడాది డిసెంబర్ 12న అయోధ్య రామమందిరం సహా హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో యోగి స్పందిస్తూ.. నాడు అయోధ్యను నిర్లక్ష్యం చేసి, రామభక్తులను అవమానించిన వారు.. ఇప్పుడు అక్కడికి వెళ్లాలనుకుంటే ముందుగా భక్తులకు, సాధువులకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు.
ఇటీవల అయోధ్యలో జరిగిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో అఖిలేశ్ పాల్గొన్న తీరుపైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు యోగి. కథా ప్రవచన కార్యక్రమాల్లో పాటించాల్సిన కనీస గౌరవ, మర్యాదలు కూడా కొందరు నేతలకు తెలియట్లేదని వ్యాఖ్యానించారు. రాముడి ఉనికినే న్యాయస్థానాల్లో ప్రశ్నించిన వారు.. ఇప్పుడాయన ఉనికిని అంగీకరించడం తమ సిద్ధాంతపరమైన విజయమని పేర్కొన్నారు. అయోధ్య తనకు రాజకీయ అంశం కాదన్న ఆయన.. విశ్వాసానికి ప్రతీక అని స్పష్టం చేశారు. రామభక్తుల మనోభావాలను గౌరవించడం, సాధువుల మార్గదర్శకత్వంలో అయోధ్యను అభివృద్ధి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని తెలిపారు. దాదాపు 500 ఏళ్ల పోరాటం, రామభక్తులు, సాధువులు, కరసేవకుల త్యాగాల ఫలితంగానే రామమందిర నిర్మాణం సాధ్యమైందన్నారు.
ఇవీ చదవండి:
ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్కాట్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం