Share News

'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్‌ దీప్కే జోస్యం

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:12 PM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. కొచ్చిలో నిర్వహించిన నిరసన సభలో ఎన్నికల సంఘం, 'సర్' ప్రక్రియపై విమర్శలు చేశారు.

'2029లో బీజేపీ ఓటమి ఖాయం'.. అభిజీత్‌ దీప్కే జోస్యం

ఇంటర్నెట్ డెస్క్: 2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఓడిపోవడం ఖాయమని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌), సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు.


ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను నియంత్రించేందుకు యత్నిస్తోందని ఈ సందర్భంగా ఆరోపించారు దీప్కే. తొలుత ప్రజలు ఏం తినాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయాల్లో జోక్యం చేసుకున్నారని.. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలనే దానిపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకే 'సర్'ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జాతీయ జెండాను ఎగురవేసినందుకు.. తనను, తన సహచరులను జైలుకు పంపారన్న దీప్కే.. స్వేచ్ఛగా ప్రశ్నించే యువతను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. యువతను అరాచకవాదులుగా చిత్రీకరించవద్దని, తాము అంబేడ్కర్‌, గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అధికారాన్ని విమర్శించే హక్కు ఉండాలని స్పష్టం చేశారు.


కొచ్చిలో నిరసన ప్రదర్శన

సీజేపీ చేపట్టిన 'జంతర్‌మంతర్‌ ఎట్‌ కొచ్చి' కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర మైదానంలో ఈ సభను నిర్వహించారు. వివిధ యువజన, సామాజిక, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఈ నిరసనల్లో పాల్గొని.. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి రాజేంద్ర మైదానం వరకు నిరసన ర్యాలీకి నాయకత్వం వహించారు.


ఇవీ చదవండి:

ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

Updated Date - Nov 08 , 2026 | 12:12 PM