Share News

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:06 AM

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెతన్యాహు కూటమికి 61 స్థానాల మెజారిటీ దక్కకపోవడంతో ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం దక్కింది.

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం
Israel President taps Netanyahu's rival Eisenkot to form Govt

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష నేత, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కాట్‌కు ప్రెసిడెంట్ ఐజాక్‌ హెర్జాగ్‌ అవకాశం కల్పించారు. దీంతో ఇజ్రాయెల్‌ తదుపరి ప్రధాని ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ఆయన నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలే రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీని దక్కించుకోలేకపోయింది. మరోవైపు ఐసెన్‌కాట్‌ నేతృత్వంలోని యాషార్‌ పార్టీ 21 స్థానాల్లో గెలుపొంది రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆయనకు మద్దతుగా 4 పార్టీల కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. 120 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది సభ్యులు మద్దతివ్వాలి. అధ్యక్షుడి సంప్రదింపులతో 67 మంది సభ్యులు ఐసెన్‌కాట్‌కు మద్దతు తెలుపగా.. 46 మంది నెతన్యాహును సమర్థించగా, మరో ఏడుగురు మాత్రం తటస్థంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు తొలి అవకాశం లభించింది.


28 రోజుల గడువు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఐసెన్‌కాట్‌కు 28 రోజుల గడువు ఇవ్వనున్నారు. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజులు పొడిగించవచ్చు. ఒకవేళ ఐసెన్‌కాట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మరో నేతకు ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఆ ప్రయత్నాలు కూడా విఫలమైతే పార్లమెంట్‌లో మరో అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోతే ఇజ్రాయెల్‌ మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు. ప్రస్తుతం నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఐసెన్‌కాట్‌ 67 మంది సభ్యుల మద్దతును ఎంతవరకు వాస్తవ మెజారిటీగా మార్చుకోనున్నారనే విషయమే ప్రస్తుతం ఆ దేశ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.


ఎవరీ ఐసెన్‌కాట్‌?

66 ఏళ్ల గాడి ఐసెన్‌కాట్‌ ఇజ్రాయెల్‌ మాజీ సైన్యాధిపతి. 2022లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2023 అక్టోబర్‌లో హమాస్‌ దాడి అనంతరం నెతన్యాహు యుద్ధకాల మంత్రివర్గంలో కొంతకాలం పనిచేశారు. అనంతరం ప్రభుత్వ విధానాలను, గాజా యుద్ధ నిర్వహణను విమర్శిస్తూ ప్రతిపక్షంలోకి మారారు. గాజాలో జరిగిన పోరులో కుమారుడు సహా ఇద్దరు బంధువులను కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో తన సైనిక అనుభవాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని నెతన్యాహుకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రజల ముందు నిలిపారు.


ఇవీ చదవండి:

ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడి హతం

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

Updated Date - Nov 08 , 2026 | 09:10 AM