Share News

ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడి హతం

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:07 AM

పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో నిందితుడి హతం
Poland Shooting

ఇంటర్నెట్ డెస్క్: పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైనా దుండగుడు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు. అయితే, అతను కాల్పులు జరపడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.


స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ దేశ సైనిక దుస్తులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి.. స్లావ్‌కోవ్స్కా వీధి నుంచి క్రాకోవ్ ప్రధాన మార్కెట్ స్క్వేర్ వైపు కారులో వెళ్తున్నాడు. అదే సమయంలో పాదచారులపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు, ఓ హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. స్థానికులు, పర్యాటకులు ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లాలని సూచించారు. అనంతరం పోలీసులకు దుండగుడు తారసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దుండగుడు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


ఈ ఘటనపై పోలాండ్ ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. దాడిని తీవ్రంగా ఖండించారు. అంతర్గత వ్యవహారాల మంత్రి నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దుండగుడి దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఖండించారు. పోలాండ్‌కు సంఘీభావం తెలుపుతూ బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హిందూ మహాసముద్రంపై డ్రాగన్ గురి.. భారీగా యుద్ధ నౌకల మోహరింపు..!

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

Updated Date - Nov 08 , 2026 | 07:19 AM