హిందూ మహాసముద్రంపై డ్రాగన్ గురి.. భారీగా యుద్ధ నౌకల మోహరింపు..!
ABN , Publish Date - Nov 07 , 2026 | 09:07 PM
చైనా తన నౌకాదళాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా అవతరించింది. అమెరికా గణాంకాల ప్రకారం చైనా వద్ద ఇప్పుడు 400కు పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.
బీజింగ్: చైనా తన నౌకాదళాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళంగా అవతరించింది. అమెరికా గణాంకాల ప్రకారం చైనా వద్ద ఇప్పుడు 400కు పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. నౌకల సంఖ్య పరంగా ఇది అమెరికా నౌకాదళం కంటే సుమారు 35 శాతం ఎక్కువ. ప్రస్తుతం చైనా వద్ద మూడు విమాన వాహక నౌకలు సేవలందిస్తున్నాయి. మరో విమాన వాహక నౌక నిర్మాణంలో ఉంది. అయితే, ఇది అణుశక్తితో పనిచేసే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాల రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనా పెరుగుతున్న సముద్ర సైనిక బలం ఇప్పుడు అమెరికా రక్షణ రంగ వ్యూహకర్తలకు ఆందోళన కలిగిస్తోంది. రోజూ సుమారు 100 చైనా నౌకలు ఆసియాలోని కీలక సముద్ర మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. చైనా నౌకాదళ కార్యకలాపాలు దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసరాలకే పరిమితం కావడం లేదు. ఫిలిప్పీన్స్ తూర్పు ప్రాంతం, జపాన్ దక్షిణ తీర ప్రాంతాలతో పాటు పశ్చిమ పసిఫిక్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వరకు విస్తరిస్తున్నాయి. భారత మహాసముద్రంలోనూ తన ఉనికిని పెంచుకునే దిశగా చైనా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఆ దేశ జలాంతర్గాములు హిందూ మహాసముద్రంలో తరచుగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య నౌకల తయారీ దేశంగా చైనా కొనసాగుతోంది. ప్రపంచ వాణిజ్య నౌకల ఉత్పత్తిలో సగానికి పైగా వాటా ఆ దేశానిదే. ఇదే భారీ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని యుద్ధ నౌకల తయారీకీ ఉపయోగిస్తోంది. షాంఘై సమీపంలోని చాంగ్షింగ్ దీవిలో ఉన్న నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఒకేసారి యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు చైనా 71 ప్రధాన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తన నౌకాదళంలో చేర్చినట్లు అమెరికా గణాంకాలను ఉటంకిస్తూ నివేదిక వెల్లడించింది.
సముద్ర మార్గాలపై పట్టు సాధించడం, వివాదాస్పద ప్రాంతాల్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడం చైనా వ్యూహంలో కీలకంగా మారింది. తైవాన్ను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న లక్ష్యంతో పాటు, భవిష్యత్తులో అమెరికా సైనిక జోక్యాన్ని అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని చైనా భావిస్తోంది. మరోవైపు జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడుతూ చైనా ఆధిపత్యాన్ని నియంత్రించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. దీంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య నౌకాదళ పోటీ మరింత పెరుగుతోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..