అమెరికా దాడుల భయం.. ఇరాన్‌లో అయోడిన్ మాత్రలు పంచుతున్నారా..
ABN , Publish Date - Nov 07 , 2026 | 02:40 PM
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది. అయితే ఈ వార్తలను ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది (US Iran Tensions).
యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో అణు కేంద్రాల చుట్టూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలకు అయోడిన్ మాత్రలను పంపిణీ చేసినట్టు 'ది టైమ్స్' పేర్కొంది. ముఖ్యంగా ఇరాన్‌లోని నటాంజ్ అణు కేంద్రం సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటైన్ (Pickaxe Mountain) ప్రాంతంపై దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు 'ది టైమ్స్' పేర్కొంది. ఈ ప్రాంతంలో అత్యంత పటిష్ఠమైన భూగర్భ నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇరాన్‌పై మరోసారి దాడులు జరపాలని అమెరికా అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వెలువడలేదు (US Iran War).
అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంటుంది. వాటిలో రేడియోధార్మిక అయోడిన్ కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో పొటాషియం అయోడైడ్ (Potassium Iodide) మాత్రలు ఉపయోగపడతాయి. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి, రేడియోధార్మిక అయోడిన్‌ను గ్రహించకుండా నిరోధించడంలో అవి సహాయపడతాయి. అయితే అయోడిన్ మాత్రల పంపిణీకి సంబంధించి 'ది టైమ్స్' ప్రచురించిన కథనాన్ని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది.
ఇవీ చదవండి:
60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన