Share News

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:47 PM

ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు అలియాస్ పప్పు గిర్ధారిని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. భార్య సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన తీవ్రమైన కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..
Girdhari Lal Sahu Arrest

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్ధారి లాల్ సాహు అలియాస్ పప్పు గిర్ధారిని డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. భార్య సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన తీవ్రమైన కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా పరారీలో ఉన్న గిర్ధారిని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో పట్టుకున్నట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోభాల్ తెలిపారు. ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయ ప్రాంగణం వెలుపల శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో సత్యేంద్ర ఠాకూర్ అనే మరో నిందితుడినీ అరెస్టు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ఎస్ఎస్పీ వెల్లడించారు.


కాగా, మంత్రి రేఖా ఆర్య ఫిర్యాదు మేరకు డెహ్రాడూన్‌లోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 15న గిర్ధారి లాల్ సాహుపై కేసు నమోదైంది. తన ఫిర్యాదులో భర్త గిర్ధారిపై మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని నెలలుగా భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. ఈ క్రమంలోనే ఆయనకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. దీనిపై ప్రశ్నించగా మొదట తన తప్పులను అంగీకరించి, రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పారని, అనంతరం మళ్లీ ఆ సంబంధాలను కొనసాగించారని ఆరోపించారు. ఆయన ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకించడంతో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, చంపేస్తానని బెదిరించారని మంత్రి పేర్కొన్నారు. తన అధికారిక నివాసంలో సిబ్బంది సమక్షంలోనే పలు సందర్భాల్లో కులపరమైన దూషణలు చేశారని రేఖా ఆర్య ఆరోపించారు.


మరోవైపు, ఓ కంపెనీలో డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను సృష్టించారని మంత్రి ఆరోపించారు. తన స్థానంలో సత్యేంద్ర ఠాకూర్‌ను డైరెక్టర్‌గా నియమించేందుకు గిర్ధారి ప్రయత్నించారని వెల్లడించారు. మంత్రి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, అప్పటికే పరారీలో ఉన్న మంత్రి భర్తను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గిర్ధారిపై 44కు పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో కొన్ని కేసుల్లో ఆయనకు గతంలోనే శిక్ష పడిందని, మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రపంచ రికార్డు.. లద్దాఖ్‌లో 13,629 అడుగుల ఎత్తులో ఐఏఎఫ్ విమానం ల్యాండింగ్..

పార్కింగ్ వివాదం.. టెక్ మహీంద్రా మాజీ బిజినెస్ హెడ్ హత్య..

Updated Date - Nov 07 , 2026 | 07:53 PM